వివాదాస్పద ఇరాన్ అణు కార్యక్రమంపై జరుగుతున్న చర్చలు ఫలితాన్ని ఇచ్చేలా కనిపిస్తున్నాయి. తమ దేశంలోని అణు కేంద్రాల తనిఖీకి ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. దీనిపై అటు అమెరికాతో పాటు.. ఈరోపియన్ యూనియన్ దేశాలు సంతృప్తి వ్యక్తం చేశాయి.
అగ్రరాజ్యాల హెచ్చరికలను బేఖాతర్ చేస్తున్న ఇరాన్.. పలు అణు కార్యక్రమాలను యధేచ్చగా చేపట్టిన విషయం తెల్సిందే. దీనిపై అమెరికా ఆగ్రహంతో ఊగిపోతోంది. ఈ నేపథ్యంలో.. ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా తీవ్రంగానే కృషి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో జెనీవాలో ఆరు అగ్రరాజ్యాలతో ఇరాన్ చర్చలు జరిపింది.
ఈ చర్చల్లో అణు కేంద్రాల తనిఖీకి ఇరాన్ అంగీకరించిందని అమెరికా విదేశాంగ ఉప మంత్రి విలియం బర్న్స్, ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ జలీలీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. తనిఖీ విషయంలో అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ)కు సంపూర్ణ సహకారం అందిస్తామని ఇరాన్ ప్రకటించింది.
ఇదిలావుండగా, ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వాషింగ్టన్‌లో మాట్లాడుతూ.. ఇరాన్‌తో అగ్రరాజ్యాలు జరిపిన చర్చలు ఫలితాన్ని ఇచ్చాయన్నారు. అదే సమయంలో అణు భద్రతపై ఇరాన్ తన నిబద్ధతను చాటుకోవాల్సి ఉందని నొక్కివక్కాణించారు. ఈ చర్చల్లో భద్రతామండలిలో సభ్యదేశాలైన అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా, జర్మనీలు పాల్గొన్నాయి.