బ్రిటన్‌లో 85 ఇస్లామిక్ షరియా కోర్టులు

బ్రిటన్‌లో మొత్తం85 ఇస్లామిక్ షరియా కోర్టులు నడుస్తున్నాయి. గతంలో అంగీకరించిన దానికంటే బ్రిటన్‌లో 17 రెట్లు ఎక్కువ షరియా కోర్టులు నిర్వహణలో ఉన్నాయని సోమవారం ఓ అధ్యయనం వెల్లడించింది. బ్రిటన్ చట్టాల కింద ఇస్లామిక్ కోర్టులకు గుర్తింపు ఇవ్వరాదని స్వతంత్ర సర్వే నివేదిక ఒకటి సిఫార్సు చేసింది.

సివిటాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వేలో బ్రిటన్‌లో మొత్తం 85 ఇస్లామిక్ షరియా కోర్టులు పనిచేస్తున్నాయి. వీటిని మసీదుల్లో నిర్వహిస్తున్నారు. ఈ కోర్టులు మత నిబంధనలకు లోబడి ఆర్థిక, కుటుంబ తగాదాలను పరిష్కరిస్తాయి. జాతీయ చట్టాల పరిధిలో నడిచే కోర్టులు ఆమోదముద్రవేస్తే షరియా కోర్టులు ఇచ్చిన తీర్పులకు పూర్తి న్యాయబద్ధత లభిస్తుంది.

ఈ షరియా కోర్టుల విచారణలో స్వతంత్రుల పరిశీలనకు అనుమతి లేకపోవడం, వారు తీసుకునే నిర్ణయాల్లో మహిళలకు ఎక్కువగా అన్యాయం జరుగుతుండటంపై తాజా నివేదిక అభ్యంతరం వ్యక్తం చేసింది. షరియా కోర్టులు మహిళలను భయపెడుతున్నాయని ఆరోపించింది. షరియా కోర్టులు ఇచ్చిన తీర్పులను రెండు పేజీలకు మించి వివరాలు లేకుండా కుటుంబ న్యాయస్థానాలకు పంపుతున్నారని పేర్కొంది.

బ్రిటన్‌లో మధ్యవర్తిత్వ చట్టం కింద షరియా ధర్మాసనాలను కోర్టులుగా గుర్తింపు లభించింది. అయితే బ్రిటీష్ చట్టాల కింద ఇస్లామిక్ కోర్టులను గుర్తింపు తొలగించాలని సివిటాస్ అధ్యయనం సిఫార్సు చేసింది. అయితే ఈ అధ్యయనంపై బ్రిటన్ ముస్లిం కౌన్సిల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అధ్యయనం ద్వేషభావాన్ని రెచ్చగొడుతుందని ఆరోపించింది.

బ్రిటన్ ముస్లిం మండలి ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. షరియా కోర్టులు పూర్తిగా చట్టప్రకారం నడుచుకుంటున్నాయని తెలిపారు. మహిళలను భయపెడుతున్నట్లు, వారిపట్ల వివక్ష చూపుతున్నట్లు వచ్చిన ఆరోపణలకు ఎటువంటి ఆధారం లేదన్నారు. ఈ వ్యవస్థ పూర్తిగా స్వచ్ఛందంగా నడుస్తుందని చెప్పారు. దీనిపై నమ్మకంలేని పౌరులు మరెక్కడికైనా వెళ్లవచ్చని పేర్కొన్నారు.

లండన్, మాంచెస్టర్, బ్రాడ్‌ఫోర్డ్, బర్మింగ్‌హామ్, నునెటాన్‌లలో మొత్తం ఐదు కోర్టులు మాత్రమే నడుస్తున్నాయని స్పష్టం చేశారు. ఈ ఐదు కోర్టులు ముస్లిం మధ్యవర్తిత్వ ధర్మాసనం ఆధ్వర్యంలో నడుస్తున్నాయని చెప్పారు. అయితే తాజా అధ్యయనం మాత్రం బ్రిటన్‌లో 85 షరియా కోర్టులు నడుస్తున్నాయని తెలిపింది.

వెబ్దునియా పై చదవండి