మన్మోహన్- జర్దారీ భేటీని స్వాగతించిన అమెరికా

రష్యా పర్యటనలో భాగంగా పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మధ్య జరిగిన సమావేశాన్ని అమెరికా ప్రభుత్వం స్వాగతించింది. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో భాగంగా ఇరుదేశాల నేతలు కలుసుకున్నారు. గత ఏడాది ముంబయి ఉగ్రవాద దాడుల అనంతరం ఇరుదేశాల అగ్రనేతలు సమావేశమవడం ఇదే తొలిసారి.

ఇరుదేశాల అగ్రనేతల మధ్య తాజా భేటీని ప్రోత్సాహకర సమావేశంగా అమెరికా పేర్కొంది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఇయాన్ కెల్లీ మాట్లాడుతూ.. ఇరుదేశాలు చర్చల పక్రియను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని తాము ఇంతకుముందు కూడా రెండు దేశాలకు తెలియజేశామన్నారు. ప్రాంతీయ స్థిరత్వాన్ని ప్రోత్సహించేందుకు, తీవ్రవాదానికి ఉమ్మడి పరిష్కారం కనుగొనేందుకు చర్చల ప్రక్రియను ముందుకుతీసుకెళ్లడం అవసరమని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి