రాజమౌళిని ఆ విషయం నేనైతే అడగను... అడిగితే నేను ఓకే : నాగార్జున ఇంటర్వ్యూ
మంగళవారం, 31 జనవరి 2017 (22:07 IST)
అక్కినేని నాగార్జున అటు కమర్షియల్ కథల హీరోనే కాకుండా.. ఇటు ఆధ్యాత్మిక చిత్రాల హీరోగా కూడా అమరాడు. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయిబాబా వంటి చిత్రాల్లో నటించి ఇప్పుడు శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుడు హథీరామ్‌బాబా పాత్రను 'ఓం నమో వేంకటేశాయ' చిత్రంలో చేస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 10న విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు.
ఈమధ్యనే చైతన్య నిశ్చితార్థమైంది. మరి పెళ్లి రోజు ఖరారు చేశారా?
ఇంకా చేయలేదు. అఖిల్, చైతన్య ఇద్దరి పెళ్లిల్లు దగ్గరగా పెట్టుకోమని చెప్పాను. ఇక వారిష్టం. డేట్ ఎప్పుడనేది త్వరలో అందరికీ తెలియజేస్తాను.
అన్నమయ్య నుంచి ఎలాంటి మార్పు గమనించారు?
సినిమా రంగంలో ఆ సినిమా పెద్ద మార్పే కల్గించింది. లోగడ 'శివ' సినిమా చరిత్రను ఎలా మార్చిందో.. అన్నమయ్య కూడా అంతే.
ఈ సినిమా మొదట్లో చేయనన్నారుగదా! కానీ మనసెందుకు మార్చుకున్నారు?
అప్పటికే 'అన్నమయ్య' తీశాం. దాన్ని చెడకొడతారనే భయపడ్డాను. అందుకే చేయనన్నాను. కానీ దర్శకులు కథ ఒకసారి వినమన్నారు. విన్నాక.. చేయాలనిపించింది. శ్రీవేంకటేశ్వరుని భక్తుల కథలే అయినా అది వేరు ఇది వేరు. ఎంచుకున్న స్క్రీన్‌ప్లే అద్భుతంగా వుంది. అన్నమయ్యలో ఒకేసారి ముగింపులో దేవుడితో మీటింగ్ వుంటుంది. కానీ ఈ కథలో.. దేవుడితో ఫ్రెండ్‌షిప్ చేస్తారు. ఇద్దరూ కలిసి పాచికలు ఆడుకుంటుంటారు. అసలు హథీరామ్ బాబా కథ చరిత్రలో పెద్దగా లేదు. ఉన్నదాన్ని తీసుకుని దానికి కొంత కల్పించి తీసిన సినిమా ఇది. అయితే ఇలాంటి సినిమాలు వస్తేనే.. సామాన్యుడికి కూడా దగ్గరవుతుంది. అన్నమయ్య చాలామందికి తెలీదు. సినిమా వచ్చాక.. అందరికీ చేరింది. అలాగే త్యాగరాయ కీర్తనలు పామరుడికి తెలీవు. వాటిని కామన్‌మేన్‌కు దగ్గర చేసేందుకు ఇటువంటి సినిమాలు దోహదపడతాయి.
అనుష్కను తీసుకోవడం సెంటిమెంటా?
కానేకాదు. అలా అయితే అన్ని సినిమాలు హిట్ కావాలి. ఆమె ఎక్కడికో వెళ్ళిపోవాలి. శ్రీరామదాసులో రామదాసును గైడ్ చేసే గురువు పాత్ర కావాలి. ఒరిజినల్ కథలో లేదు. అలాగని సినిమా కథలో రాసుకున్నారు. గురువు స్థాయి ఎవరా అనుకుని... నాన్నగారిని ఎంపిక చేశారు. ఇందులోనూ హథీరామ్‌బాబా తిరుపతి వచ్చాక ఎలా వున్నాడు. ఎవరు ఆశ్రయిం ఇచ్చారు. దేవుడికి ఎలా దగ్గరయ్యాడనేది కావాలి. దానికి ఓ గైడ్ కావాలి. ఆ పాత్రే కృష్ణమ్మ. చిన్న వయస్సులోనే వేంకటేశ్వరుడికి జీవితాన్ని అంకితం చేసిన పాత్ర అది. ఆమె రామ్‌బాబాకు ఆశ్రయం కల్పిస్తుంది. ఆ పాత్రకు ఆమే కరెక్ట్‌గా సూటవుతుందని ఎంచుకున్నాం.
ఒకవైపు రగడ, సోగ్గాడే.. మరోవైపు. భక్తుడిగా ఎలా చేయగలగుతున్నారు. అందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారా?
దీన్ని తేలిగ్గా చెప్పాలంటే... మనం ఐమాక్స్‌కు వెళ్ళాలంటే.. ఎలాగైనా వెళతాం. కానీ గుడికి వెళ్ళాలంటే.. కొన్ని కట్టుబాట్లతో వెళ్సాల్సివస్తుంది. పూజగదిలో నుంచి వచ్చాక దైనందిక కార్యక్రమాలు ఎలా నిర్వర్తిస్తామో.. కమర్షియల్ సినిమాలు అదేవిధంగా చేస్తాను. ఇందుకోసం ప్రత్యేక శిక్షణలు, నిబంధనలు ఏమీ పెట్టుకోను. తిరుమలకు వెళ్ళినరోజు మాంసాహారం తినం. అలాగే ఈ సినిమా చేసేటప్పుడు కొన్ని కట్టుబాట్లు పెట్టుకుంటాం. సెట్లోకి వచ్చేటప్పుడే అంతర్లీనంగా మైండ్ సెట్ అవుతుంది. శుభ్రంగా స్నానం చేసి బట్టలు మార్చుకుని వస్తాం. ఆ వాతావరణంలోకి రాగానే అందరూ ఆ మూడ్‌లోకి వచ్చేస్తాం. అందుకు దర్శకుడు తగినవిధంగా అందరినీ గైడ్ చేస్తుంటారు.
షూటింగ్‌లో మీరేమైనా సూచనలు చేశారా?
ఏమీ చేయలేదు. ఆయనకు అన్ని విషయాల్లో పట్టువుంది. క్లారిటీ వుంది. ఏదైనా సీన్ చేస్తే.. తన అసిస్టెంట్స్ మొహాల్లోనే అది బాగుందా లేదా కనిపెట్టేయగలరు. కాకపోతే ఆయనకు తెలీంది.. టెక్నికల్ వర్క్. సీజీవర్క్ ఆయన ఏ సినిమాలోనూ వాడలేదు. ఆ విషయాలు చూసేలా చర్యలు తీసుకున్నాను. వైకుంఠం లాంటి సెట్‌వేయాలంటే. సీజీ వర్క్ కావాల్సిందే. ఇలా కొన్ని సన్నివేశాలు వాటితోనే ఆధారపడి వున్నాయి. అందుకే రిలీజ్ డేట్ అనేది ప్రారంభోత్సవంనాడు చెప్పలేదు.
మీకు నచ్చిన పాట ఏమిటి?
'అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా...' అనేది చాలా ఇష్టం. దాన్ని తీసేటప్పుడు శ్రీవారికి ఇష్టమైన అన్ని పూలను తెప్పించి దర్శకులు తెరకెక్కించారు. ఈ సినిమా కోసం చిక్‌మంగులూరు, మహాబలేశ్వరం...వంటి ప్రాంతాలకు వెళ్ళాం. కొంత సెట్ వేశాం. ఎందుకంటే.. 600 ఏళ్లక్రితం కథ కాబట్టి ఇప్పటి టెంపుల్‌లా అప్పుడు వుండదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం.
సోగ్గాడే 50 కోట్ల క్లబ్‌కు చేరుకుంది. మొన్న చిరంజీవి, 100 కోట్లు చేరుకున్నారు. ముందుముందు పెరిగా ఛాన్స్ వుందా?
నేను ఏ క్లబ్‌లో లేను. ఈ క్లబ్ అనేవి కాలాన్ని బట్టి మారుతుంది. చిరంజీవిగారు వందకోట్లంటే.. దాదాపు 40 ఏళ్ళ కెరీర్‌లో వున్న వ్యక్తి చేసి సాధించడం గొప్ప విషయం. ఆయన సినిమా చూశాను. ఫ్యాన్స్ ఇంకా ఆయన్ను కోరుకుంటున్నారు. అలాగే బాలకృష్ణ 'శాతకర్ణి' చూశాను. ఆయన ఆ పాత్రకూ సూటయ్యారు. క్రిష్ అద్భుతంగా తెరకెక్కించారు.
మీకూ అలాంటి పాత్ర చేయాలని ఎప్పుడైనా అనిపించిందా?
చిన్నతనం నుంచీ రామాయణ, మహాభారతంలోని పాత్రలు నాన్నగారు, ఎన్‌టిఆర్‌గారు వేసినవి చూశాను.. అందులో 'మాయాబజార్' నా ఫేవరేట్.. అటువంటి పాత్ర చేయాలను వుంది. అయితే రాజమౌళిగారు 'మహాభారతం' చేస్తారని విన్నాను. నేనైతే అడగను. ఆయనకు నా అవసరం అనుకుంటే తప్పకుండా చేస్తా.
రీమేక్ చిత్రాలు ఏమైనా చేసే ఆలోచన వుందా?
మోహన్‌లాల్ చేసిన 'ఒప్పం' చేయమని అడిగారు. అలాగే ఈమధ్యనే తమిళ 'ధ్రువంగల్...' చేయమన్నారు. అది బాగా ఆడింది. అయితే అవి ఆయా రేంజ్ చిత్రాలే అంత పెడితేనే వర్కవుట్ అవుతుంది. పెద్ద స్టార్ చిత్రాలు మాత్రం కాదు.
అఖిల్ రెండో సినిమా ఎంతవరకు వచ్చింది?
రెండు మూడు నెలల్లో ఫైనల్ అవుతుంది. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలోనే వుంటుంది. అన్నపూర్ణ బేనర్‌లోనే... కొత్త జోనర్‌లో వుంటుంది. యూత్‌కు ప్రతినిధిగా వుండే కథ.
ద్విభాషా చిత్రాలు చేయడం ఇష్టమేనా?
అది కథను బట్టే వుంటుంది. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వున్నాయి. ఇతర భాషల్లో తీయాలంటే.. వారి నేటివిటీకి సింక్ అవుతుందా లేదా? అని ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయాలి. అన్ని అలా కుదరవు. 'ఊపిరి' మొదట తెలుగులోనే తీయాలనుకున్నాం. కానీ కార్తీ వచ్చాక.. కాస్త కథను మార్చి తమిళంలో కూడా తీయాల్సివచ్చింది. అలా అన్నీ కుదరవు.
మీలో ఎవరు కోటీశ్వరుడు వదులుకోవడానికి కారణం?
ఇప్పటికే మూడు సీజన్స్ చేసేశాను. మొనాటనీ వచ్చేసింది. ప్రేక్షులే వద్దులే అనేకంటే.. నాకు నేనుగా దూరం అవ్వాలనుకన్నా.. ఇప్పుడు చిరంజీవి కొత్తగా వస్తున్నారు. ఆయన కొత్తగా కన్పిస్తారు. మాస్ పల్స్ బాగా తెలిసిన వ్యక్తి చేస్తే ఇంకాస్త కొత్తదనం వుంటుంది.
ఆ ప్రోగ్రామ్‌లోని కొందరి జీవితాల కథలు సినిమాలకు వుపయోగించవచ్చని అనిపించాయా?
ఎందరో కథల్ని విన్నాను. వారి కథలు విని నన్ను నేను మార్చుకున్నాను కూడా. బయట జీవితం చాలా వుందనిపించింది. అందుకే వారి కథల్లోని కొన్ని సీన్లు అప్పుడప్పుడు సినిమాల్లో వాడేసుకున్నాం. మరికొన్ని వాడుకుంటున్నాం. అవన్నీ రియల్ స్టోరీలు. వాటిని చిన్నచిన్న సినిమాలుగా తీయలేం అని ముగించారు.