ఉపరాష్ట్ర పదవికి జగ్దీప్ ధన్కర్ రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి పదవి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కసరత్తు చేపట్టింది. ఈ కసరత్తు పూర్తవగానే ఎన్నికల షెడ్యూ్ల్‌ను వెల్లడించనుంది. ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఎలక్టోరల్ కాలేజీని సిద్ధం చేయడంలో, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించడంలో ఎన్నికల సంఘం బిజీ అయిపోయింది.
ఉపరాష్ట్రపతి, రాష్ట్రపదవి ఖాళీకాగానే రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. ఆ మేరకు ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఈసీ కసరత్తు చేస్తోంది. అనారోగ్య కారణాలతతో తాను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకుంటున్నానని పేర్కొంటూ జగ్దీప్ ధన్కర్ సోమవారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముమ్మకు తన రాజీనామా పంపగా ఆమె ఆమోదించారు. దీంతో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఉపరాష్ట్రపతి పదవి రేసులో నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పేరు కూడా ఉంది. నితీశ్ కుమార్‌ను ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడం కోసమే జగ్దీప్ ధన్కర్ రాజీనామా చేయించారనే వార్తలు వినిపిస్తున్నాయి. పలు ప్రతిపక్షాలు ఈ విషయంపై ఆరోపణలు చేస్తున్నాయి. బీహార్‌లో సొంత పార్టీ నేతను సీఎం స్థానానికి ఎంపిక చేసి, నితీశ్ కుమార్ తనయుడికి ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగించే ఆలోచనలో భాగంగా కేంద్రంలోని బీజేపీ జగ్దీప్ ధన్కర్‌తో రాజీనామా చేయించిందని అంటున్నారు. అయితే తాను ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్లుగా జగ్దీప్ ధన్కర్ ప్రకటించారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి క్రమంగా దూరమవుతున్న సీనియర్ ఎంపీ శశిథరూర్ పేరు కూడా ఉపరాష్ట్రపతి రేసులో వినిపిస్తోంది. ఈయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకోనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే కేరళలో సొంత పార్టీ నేతలే ఆయనను పక్కన పెట్టినట్లు ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ ఇద్దరితో పాటు ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లలో ఒకరికి అవకాశం ఇవ్వవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గత మూడేళ్లుగా ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆప్ అధికారంలో ఉన్న సమయంలో అనేక విషయాల్లో నాటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌తో విభేదించి తరచూ వార్తల్లో నిలిచారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి ఎల్జీ సక్సేనాతో వివాదం కూడా ఒక కారణమని భావిస్తున్నారు. దీంతో ఆయన కేంద్రం దృష్టిలో పడ్డారు.
అలానే ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న సీనియర్ బీజేపీ నేత మనోజ్ సిన్హా పదవీ కాలం వచ్చే నెల 6వ తేదీతో ముగియనుంది. ఈయన గతంలో పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా వ్యవహరించడంతో పాటు మోడీ తొలి క్యాబినెట్‌లో కేంద్ర సహాయ మంత్రిగానూ పని చేశారు. ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సిన్హా పాలనలో తనదైన ముద్ర వేశారు. ఈ క్రమంలో సిన్హా పేరు కూడా ఉపరాష్ట్రపతి రేసులో వినిపిస్తోంది.