కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్లో మెరుగ్గా ఆడేందుకు భారత క్రికెటర్లు నువ్వానేనా అంటూ పోటీపడుతున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్-10లో సత్తాచాటేందుకు రెడీ అయిపోతున్నాడు భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్. ఐపీఎల్‌లో రాణించడం ద్వారా భారత జాతీయ జట్టులోకి స్థానం సంపాదించేందుకు శిఖర్ ధావన్ మల్లగుల్లాలు పడుతున్నాడు.
2013లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై టెస్ట్ అరంగేట్రంలోనే ధవన్ (187) మెరుపు సెంచరీతో సంచలనం సృష్టించాడు. అయితే గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ధవన్ ఇటీవల కంగారూలతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో ఆడేందుకు అవకాశాన్ని కోల్పోయాడు. అయితే ఐపీఎల్‌తో పాటు దేశవాళీ టోర్నీల్లోనూ నిలకడగా రాణించి టీమిండియాలోకి వస్తానని శిఖర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
ఈ సందర్భంగా శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. జాతీయ జట్టుకు దూరమైనందుకు ఎంతోగానో బాధగా ఉందన్నాడు. త్వరలోనే టీమిండియాలో స్థానం సంపాదించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నానని.. తన ఆటపై సంతృప్తికరంగానే ఉన్నానని చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు ప్రతీ టోర్నీ ఎంతో కీలకమని, ఇందుకో భాగంగా ఈ సీజన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున అత్యుత్తమ ప్రదర్శనకు కృషి చేస్తానని చెప్పాడు. తొలి మ్యాచ్‌లో కోహ్లీ జట్టుతో బరిలోకి దిగుతున్నాం.. కోహ్లీ లేకపోయినా ఆ జట్టును సులభంగా అంచనా వేయలేమని శిఖర్ ధావన్ వ్యాఖ్యానించాడు.