ఆఖరి అంకానికి చేరిన ఐపీఎల్.. నేడు గెలిచే జట్టు నేరుగా ఫైనల్‌కు...
గురువారం, 5 నవంబరు 2020 (11:41 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా స్వదేశంలో జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ పోటీలు యూఏఈ వేదికగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ పోటీలు ఆఖరి అంకానికి చేరుకున్నాయి. ఈ సీజన్ లీగ్ పోటీలకు మరో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలివున్నాయి. ఇందులోభాగంగా, గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఈ సీజన్ 57వ మ్యాచ్ జరుగనుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆధిపత్య పోరాటమే.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టనుంది. అందుకే ఈ మ్యాచ్‌ను ఆధిపత్య పోరాటంగా అభివర్ణిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఓడిపోయే జట్టు, ఎలిమినేటర్-1 మ్యాచ్‌లో గెలిచే జట్టుతో పోరాడి గెలిస్తేనే ఫైనల్‌కు వెళుతుంది. అందుకే ఈ మ్యాచ్‌లో విజయం కోసం ఇరు జట్లూ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
అయితే, ఇరు జట్ల బలాబలాలను, ఈ సీజన్ విజయాలను పరిశీలిస్తే, ముంబై జట్టుదే పైచేయిగా ఉన్నా, కేవలం రెండున్నర గంటల వ్యవధిలో ఏ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే, ఆ జట్టుదే విజయం అయ్యే ఐపీఎల్‌లో ఢిల్లీ సైతం సర్వశక్తులూ ఒడ్డి పోరాడేందుకు సిద్ధమవుతోంది.
ఈ సీజన్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయాణం పడుతూ, లేస్తూ సాగిందనడంలో సందేహం లేదు. తొలి దశలో 9 మ్యాచ్‌లలో 7 విజయాలు సాధించిన ఢిల్లీ, ఆపై నాలుగు వరుస మ్యాచ్‌లలో ఓడిపోయి, చివరకు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించి, ప్లే ఆఫ్ దశకు చేరుకుంది.
ఇక ముంబై జట్టు తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతిలో ఎదురైన ఓటమి మినహా, మిగతా అంతా సాఫీగానే సాగింది. 14 మ్యాచ్‌లలో 9 మ్యాచ్‌లలో విజయం సాధించింది. రెండు సార్లు సూపర్ ఓవర్ ఓడిపోయింది.
ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే, తొలి మ్యాచ్ నుంచీ ఢిల్లీ జట్టు సమష్టి ప్రదర్శనతోనే గెలుస్తూ వచ్చింది. స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్ ఇప్పటికే 525 పరుగులు చేశాడు. ధావన్‌కు సహకరించేందుకు శ్రేయాస్ అయ్యర్, స్టోయినిస్, పంత్ వంటి ఆటగాళ్లతో పాటు బౌలింగులో రబాడా, నోర్జే, అక్సర్ పటేల్‌లు ఎలానూ ఉన్నారు.
ఇక, ముంబై విషయానికి వస్తే, ప్రధాన ఆటగాళ్లు ఫాంలో ఉండటం, సూర్యకుమార్, డికాక్, ఇషాంత్ కిషన్, పాండ్యాలతో పాటు పొలార్డ్ అదనపు బలం. బౌలింగ్ వరల్డ్ టాప్ బౌలర్ బుమ్రాతో పాటు నిప్పులు చెరిగే బంతులను వేయగల బౌల్ట్ లను ఎదుర్కోవడం ఎంతటి ప్రత్యర్థులకైనా కష్టమే. ఏదిఏమైనా గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు పూర్తి మజాను ఇస్తుందనడంలో సందేహం లేదు.