ఐపీఎల్ 2020 : సన్‌రైజర్స్ హైదరాబాద్.. బలం.. బలహీనతలు.. (Video)

శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (15:30 IST)
క్రికెట్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రారంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ టోర్నీలో పాల్గొంటున్న జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ఒకటి. డెక్కన్ చార్జర్స్ స్థానంలో 2013లో ఐపీఎల్ ఫ్రాంచైజీగా ఎంట్రీ ఇచ్చిన జట్టు. 2016లో చాంపియన్‌గా నిలిస్తే 2018లో రన్నరప్‌గా నిలిచింది. 
 
ఐపీఎల్‌లో ఫ్రాంచైజీల్లో నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్న జట్లలో సన్‌రైజర్స్ ఒకటి. దుర్భేద్యమైన టాప్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌తోపాటు తిరుగులేని పేస్‌, స్పిన్‌ బౌలింగ్‌తో అత్యంత బలీయంగా కనిపిస్తున్న ఈ జట్టు మిడిలార్డర్‌ కూడా రాణిస్తే మరో ట్రోఫీ అందుకోవడం కష్టం కాబోదు.
 
ఈ జట్టులో విదేశీ ఆటగాళ్లైన డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో వంటి విధ్వంసక బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. వీరితో పాటు. కేన్ విలియమ్సన్ రూపంలో మ్యాచ్‌ను ఒంటి చేత్తో శాసించగల ఆటగాడు ఆ జట్టు సొంతం. దానికితోడు ఎంతో అనుభవజ్ఞుడైన వీవీఎస్‌ లక్ష్మణ్‌ మార్గదర్శనం, గత కోచ్‌ టామ్‌ మూడీ జట్టును నడిపిన విధానం.. వెరసి ఐపీఎల్‌లో హైదరాబాద్‌ తనదైన ముద్ర వేస్తోంది. గత యేడాది విలియమ్సన్‌ సారథ్యంలో ఆడిన జట్టు ఈసారి మళ్లీ వార్నర్‌ కెప్టెన్సీలో బరిలోకి దిగుతోంది. 
 
ఈ జట్టు బలాబలాలను పరిశీలిస్తే, ఓపెనింగ్‌ జోడీ వార్నర్‌, బెయిర్‌ స్టో సన్‌రైజర్స్‌కు అతిపెద్ద బలం. గత సీజన్‌లో వారి మెరుపు ఆరంభాలు ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాయి. కాకపోతే ఆ శుభారంభాలను మిడిలార్డర్‌ ముందుకు తీసుకుపోలేకపోయింది. దాంతో ఈసారి వేలంలో మిడిలార్డర్‌ను పటిష్టం చేసుకొనే లక్ష్యంతో విరాట్‌ సింగ్‌, ప్రియం గార్గ్‌, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన అబ్దుల్‌ సమద్‌ వంటి యువ క్రికెటర్లను ఎంచుకుంది. బౌలింగ్‌ విభాగానికొస్తే పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌ భువనేశ్వర్‌ కుమార్‌, మేటి స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌తో తిరుగులేకుండా ఉంది. వారికి ఖలీల్‌ అహ్మద్‌, సిద్దార్థ్‌ కౌల్‌, బిల్లీ స్టాన్‌లేక్‌ మద్దతిస్తే హైదరాబాద్‌కు తిరుగుండకపోవచ్చు.
 
అలాగే, బలహీనతలను బేరీజువేస్తే, మిడిలార్డర్‌లో అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్‌ లేకపోవడం జట్టుకు పెద్దలోపంగా చెప్పుకోవచ్చు. ఆ లోటును అధిగమించేందుకు ఈసారి టీమిండియా ఆటగాళ్లను ఎంచుకుంది. అయితే యువ క్రికెటర్లు ఒత్తిడిని తట్టుకొని అంచనాలను అందుకుంటారా లేదా అన్నది చూడాలి. ఆసీస్‌ ఆటగాడు మిచెల్‌ మార్ష్‌ను రూ.2 కోట్లతో కొనుగోలు చేసింది. కానీ టాప్‌ ఆర్డర్‌తోపాటు ప్రధాన స్పిన్నర్‌ విదేశీ క్రికెటర్లే అయినందున మార్ష్‌కు తుది జట్టులో చోటు లభించడం ప్రశ్నార్థకం. మిడిల్‌లో మనీష్‌ పాండే ఉన్నా.. అతడు స్థాయికితగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. 
 
ఈ జట్టులో స్వదేశీ ఆటగాళ్లు మనీష్‌ పాండే, అభిషేక్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, సందీప్‌ శర్మ, సిద్ధార్థ్‌ కౌల్‌, ఖలీల్‌ అహ్మద్‌, వృద్ధిమాన్‌ సాహా, విజయ్‌ శంకర్‌, నటరాజన్‌, విరాట్‌ సింగ్‌, ప్రియంగార్గ్‌, సందీప్‌ బవనాక, షాబాజ్‌ నదీం, శ్రీవత్స గోస్వామి, బాసిల్‌ థంపి, అబ్దుల్‌ సమద్‌, సంజయ్‌ యాదవ్‌లు వుంటే, డేవిడ్‌ వార్నర్‌ (కెప్టెన్‌), బెయిర్‌ స్టో, కేన్‌ విలియమ్సన్‌, రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబీ, బిల్లీ స్టాన్‌లేక్‌, ఫాబియన్‌, మిచెల్‌ మార్ష్‌ వంటి విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు