కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్2020) పోటీలు వచ్చే సెప్టెంబరు నుంచి యూఏఈ వేదికగా ప్రారంభంకానున్నాయి. నిజానికి ఇదే నెలలో ఐసీసీ నిర్వహించే ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు జరగాల్సివుంది. కానీ, కరోనా వైరస్ భయం కారణంగా ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వాల్సిన క్రికెట్ ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. దీంతో ఈ పోటీలను ఐసీసీ వచ్చే యేడాదికి వాయిదావేసింది. దీంతో ఐపీఎల్ పోటీల నిర్వహణకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.
ఈ విషయమై అన్ని ఫ్రాంచైజీలకూ బీసీసీఐ నుంచి సమాచారం వెళ్లిందని, పోటీల నిర్వహణపై వారి సలహాలు, సూచనలు కూడా తీసుకోనున్నామని ఓ అధికారి వెల్లడించారు. పోటీలు 51 రోజుల పాటు సాగుతాయి కాబట్టి, ప్రసార హక్కులను పొందిన కంపెనీలు, ఇతర వాటాదారులకు సైతం ఎటువంటి అభ్యంతరాలూ ఉండబోవని భావిస్తున్నట్టు పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
వాస్తవానికి సెప్టెంబర్ 26 నుంచి ఈ పోటీలను ప్రారంభిస్తారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ, ఐపీఎల్ ముగియగానే, ఆస్ట్రేలియా పర్యటనకు భారత క్రికెట్ జట్టు వెళ్లాల్సి వుండటం, ఆ దేశ ప్రభుత్వ నిబంధనల మేరకు ఆసీస్ వెళ్లిన ఆటగాళ్లంతా 14 రోజుల క్వారంటైన్ పాటించడం తప్పనిసరి కావడంతో, ఓ వారం ముందుగానే ఐపీఎల్‌ను ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయంలో నేడో, రేపో అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.