ఐపీఎల్ రద్దుతో అయోమయంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. ఏమైంది?

మంగళవారం, 4 మే 2021 (19:26 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్, ఇతర సిబ్బంది ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. 
 
భారత్‌లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఐపీఎల్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌ వినిపిస్తూ వచ్చింది. మరొకవైపు బయోబబుల్‌ వాతావరణంలో ఐపీఎల్‌ను నిర్వహిస్తున్నా క్రికెటర్లకు కరోనా రావడంతో కలకలం మొదలైంది. నిన్న కేకేఆర్‌, సీఎస్‌కే క్యాంపులో వెలుగుచూసిన కరోనా.. ఈరోజు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ శిబిరాన్ని కూడా ఆందోళనకు గురి చేసింది.
 
వృద్ధిమాన్‌ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అమిత్‌ మిశ్రాకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో బయో బబుల్‌లో ఉన్నప్పటికీ ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో టోర్నీ నిర్వహణపై సందిగ్దత నెలకొనగా.. నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
 
ఇప్పటికే 9 మందికి కరోనా సోకడంతో ఐపీఎల్‌ను రద్దు చేయకతప్పలేదు. నిన్నటి వరకూ కచ్చితంగా జరిపి తీరుతామని పేర్కొన్న బీసీసీఐ.. ఎట్టకేలకు దిగివచ్చింది. క్రికెటర్లకు ఏమైనా అయితే అది మరింత తలనొప్పిగా మారే ప్రమాదం ఉండటంతో టోర్నీని వాయిదా వేసింది. 
 
ఐపీఎల్‌ మధ్యలోనే ఆగిపోవడంతో ఆసీస్‌ క్రికెటర్ల పరిస్థితి అయోమయంలో పడింది. ఇప్పటికే కొంతమంది లీగ్‌ను వీడి స్వదేశాలకు వెళ్లిపోగా, ఇంకా చాలామంది క్రికెటర్లు ఇక్కడే ఉండిపోయారు. వారితో పాటు ఆసీస్‌కు చెందిన కోచింగ్‌ స్టాఫ్‌, సహాయక సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు. 
 
ఇప్పుడు వీరి పరిస్థితి ఏమిటి అనేది అర్థం కావడం లేదు. ఈ విషయంలో బీసీసీఐ ముందుగానే భరోసా ఇచ్చినా.. ఆస్ట్రేలియాకు భారత్‌ నుంచి విమానరాకపోకలు నిలిపివేయడంతో అనిశ్చితి నెలకొంది. మే 15 వరకూ భారత్‌ విమానాలను నిషేధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాము ఎలా స్వదేశాలకు వెళ్లాలో వారికి అర్థం కావడం లేదు. 
 
దీనిపై క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) కూడా తాము ఏమీ చేయలేమని చేతులెత్తేయడంతో ఇక వారికి బీసీసీఐ, భారత ప్రభుత్వమే దిక్కు. ఇక్కడ బీసీసీఐ పెద్దలు, భారత పెద్దలు చొరవ తీసుకుంటే గానీ వారు ఆస్ట్రేలియాకు వెళ్లే పరిస్థితి లేదు. ఇప్పుడు ఐపీఎల్‌ను రద్దు చేసిన బీసీసీఐ.. విదేశీ క్రికెటర్లను సురక్షితంగా వారి వారి దేశాలకు పంపే పనిలో పడింది. ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా తమ ఆశల్ని బీసీసీఐ మీదే పెట్టుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు