అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రదర్శనతో బెంగుళూరు ఆట కట్టించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఐపీఎల్-10వ సీజన్‌లో తన జోరును కొనసాగిస్తోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు రాయల్ చాలెంజర్స్‌ను పంజాబ్ మట్టికరిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగుళూరు జట్టును 20 ఓవర్లలో 148/4 పరుగులకు కట్టడి చేసింది పంజాబ్. బెంగుళూరు ఆ మాత్రం గౌరవప్రదమైన స్కోరు చేసిందంటే అందుకు కారణం ఏబీ డివిలియర్స్ (89; 46 బంతుల్లో; 9 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటమే. 149 పరుగుల లక్ష్యంతో చేధనకు దిగిన పంజాబ్ జట్టుకు ఓపెనర్లు వోహ్రా(34; 21 బంతుల్లో), హషీమ్ ఆమ్లా(58; 38 బంతుల్లో) నాటౌట్ శుభారంభాన్నిచ్చారు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ వెంటనే వెనుదిరిగినా.. కెప్టెన్ మ్యాక్స్‌వెల్ (43; 22 బంతుల్లో) నాటౌట్ తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. దీంతో మరో 33 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ లక్ష్యాన్ని చేధించింది. పంజాబ్ బౌలర్లలో ఆరోన్‌కు రెండు వికెట్లు దక్కగా.. అక్షర్‌పటేల్, సందీప్ శర్మలు చెరో వికెట్ పడగొట్టారు. బెంగుళూరు బౌలర్లలో తైమల్ మిల్స్, ఇమ్రాన్ తహీర్‌లకు చెరో వికెట్ దక్కింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున తొలి మ్యాచ్ ఆడుతున్న ఏబీ డివిలియర్స్ పరుగుల మోత మోగించాడు. సోమవారం ఇక్కడ కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో డివిలియర్స్ విశ్వరూపం ప్రదర్శించాడు. 46 బంతుల్లో 9 సిక్సర్లు, 3 ఫోర్లతో చెలరేగి ఆడి 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒకవైపు బెంగళూరు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో డివిలియర్స్ ఒంటరి పోరాటం చేశాడు.