'అంకుల్ చిప్స్' ఓ ప్యాకెట్ కొంటే 1 జీబీ డేటా ఫ్రీ.. ఎలా?

బుధవారం, 2 సెప్టెంబరు 2020 (11:09 IST)
దేశంలో ఉన్న ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన ఎయిర్ టెల్ టెలికాం దిగ్గజం మొబైల్ వినియోగదారులను మరింతగా పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం పలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తోంది. తాజాగా రూ.10 విలువ చేసే లేస్ ప్యాకెట్ కొనుగోలు చేసినవారికి 1 జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ప్రముఖ స్నాక్, కూల్‌‌డ్రింక్ బ్రాండ్ పెప్సీకోతో డీల్ కుదుర్చుకుంది. 
 
ఇందులోభాగంగా, ఉచిత ఇంటర్నెట్ డేటాను అందించేలా ఆఫర్లను ప్రకటించాలని నిర్ణయించింది. లేస్, కుర్‌కురే, అంకుల్ చిప్స్ తదితర ప్యాక్‌లను కొనుగోలు చేసే వారికి ఉచితంగా ఇంటర్నెట్ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. రూ. 10 ప్యాక్ తో 1 జీబీ ఇంటర్నెట్ డేటాను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. 
 
ఇక ఈ ఉచిత డేటాను పొందడానికి, ప్యాకెట్ వెనుక భాగంలో ఉన్న ఉచిత రీఛార్జ్ కోడ్‌‌ను ఎయిర్ ‌టెల్ థాంక్స్ యాప్‌‌లోని కూపన్స్ విభాగంలో నమోదు చేయాలని, రూ.10 విలువైన చిప్స్‌ ప్యాకెట్‌పై 1 జీబీ, రూ.20 విలువైన చిప్స్‌పై 2 జీబీ లభిస్తుందని, కూపన్ రిడీమ్ చేసిన తర్వాత మూడు రోజుల్లో డేటాను వాడుకోవాలని ఎయిర్ టెల్ ప్రకటించింది. 
 
ఇకపై తమ వినియోగదారులు డిజిటల్ కంటెంట్ చూస్తూ, తమ ఉత్పత్తులను ఎంజాయ్ చేయవచ్చని పెప్సికో ఇండియా సీనియర్ డైరెక్టర్ (కేటగిరీ హెడ్ ఫుడ్స్ విభాగం) దిలేన్ గాంధీ వ్యాఖ్యానించారు. కాగా, దేశీయ టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో సేవలు ప్రారంభమైన తర్వాత ఎయిర్ టెల్‌కు అపారమైన నష్టం వాటిల్లిన విషయం తెల్సిందే. దీన్ని భర్తీ చేసుకునే పనిలోభాగంగా, ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు