దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకు వీలుగా ప్రైవేట్ టెలికాం దిగ్గజ కంపెనీ ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్లతో ముందుకువస్తోంది. ఇప్పటికే జియోకు ధీటుగా వివిధ రకాల ఆఫర్లను ప్రకటించిన ఎయిర్‌టెల్.. ఇపుడు జియో 4జీ ఫీచర్ ఫోనుకు పోటీగా ఎయిర్‌టెల్ 4జీ బడ్జెట్ ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది.
ఈ బడ్జెట్ ఫోన్ కోసం ఇప్పటికే పలు మొబైల్ తయారీ సంస్థలతో చర్చలు జరుపింది. ఈ చర్చలు సఫలీకృతం కావడంతో దీపావళి నుంచి మార్కెట్‌లోకి విడుదల చేయాలని భావిస్తోంది. ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టనున్న 4జీ ఫోన్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారంగా పనిచేయనుంది. ఫోన్‌తో పాటు ఎయిర్‌టెల్ సిమ్‌ను ఉచితంగా అందివ్వనున్నారు. దీంతో ఆకర్షణీయమైన డేటా ఆఫర్లను అందివ్వనున్నట్టు సమాచారం.
కాగా ఈ ఫోన్‌లో డ్యుయల్ సిమ్, 4జీ వీవోఎల్‌టీఈ, పెద్ద బ్యాటరీ, 1 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లు ఉంటాయని తెలుస్తున్నది. త్వరలోనే ఈ ఫోన్ గురించి మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం మేరకు.. ఈ ఎయిర్‌టెల్ బడ్జెట్ ఫోన్ ధర రూ.2500 నుంచి రూ.2700 మధ్య ఉండే అవకాశం ఉంది. కాగా, రిలయన్స్ జియో రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌ని వసూలు చేసి ఉచితంగా ఫోన్‌ను అందజేయనున్న విషయం తెల్సిందే.