కేంద్ర ప్రభుత్వ ఐటీ విధానాలకు ట్విట్టర్ యాజమాన్యం ఎట్టకేలకు అంగీకరించింది. సామాజిక మాధ్యమాల కట్టడికి కేంద్రం కొత్తగా ఐటీ విధానాలను అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫేస్‌బుక్ సహా పలు సోషల్ మీడియా, ఓటీటీ సంస్థలు ఈ నియమావళిని అంగీకరించాయి.
సామాజిక మాధ్యమాల కట్టడికి మూడు నెలల క్రితం, అంటే ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వాటి అమలుకు కేంద్రం ఇచ్చిన మూడు నెలల గడువు మే 25తో ముగియడంతో కేంద్ర ప్రభుత్వం మే 26న రంగంలోకి దిగింది.
అయితే ఇదే సమయంలో ట్విట్టర్ కార్యాలయంలో ఢిల్లీ పోలీసులు తనిఖీకి రావడం సంచలనంగా మారింది. అనంతరం తమ ఉద్యోగుల భద్రతపై, వాక్స్వాతంత్ర్యానికి కలుగుతున్న ముప్పుపై ఆందోళన కలుగుతోందని ట్విట్టర్ ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.