టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు మరో ఆఫర్ ప్రకటించింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశ వ్యాప్త ఉచిత రోమింగ్ సేవలను ప్రారంభిస్తున్నట్టు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అన్ లిమిటెడ్ కాల్స్, డేటా, రోమింగ్ అంటూ ఉచిత మంత్రంతో టెలికాం రంగంలో అడుగుపెట్టి మిగతా కంపెనీలకు ముచ్చెమటలు పట్టించిన రిలయన్స్ జియోను ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ఇప్పటికే పలు ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఉచిత ఆఫర్లను ప్రకటిస్తూ ముందుకు పోతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ తన మొబైల్ యూజర్లకు శుభవార్త చెప్పింది.
తమ కస్టమర్లు దేశంలోని ఏ ప్రాంతంలో ఉన్నా కాల్స్, డేటా, మెసేజ్‌లపై ఉచితంగా రోమింగ్ అందుకోవచ్చని ప్రకటించింది. ఈ ఆఫర్ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే అమలులోకి వస్తుందని తెలిపింది. దీంతో ఎయిర్‌టెల్ వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు కలగనున్నాయి.
మరోవైపు... రిలయన్స్ జియో ఆఫర్లపై ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ మండిపడ్డారు. జియో తీరుతో భారత టెలీకాం పరిశ్రమ ఆర్థికంగా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో స్పెక్ట్రం రేట్లు కూడా విపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక‌్తం చేశారు. జియో ప్రైమ్ పేరిట కొత్తగా టారిఫ్ ప్లాన్లు ప్రకటించడం దౌర్జన్యమని, భరించలేని చర్య అని అన్నారు.
కాగా, రిలయన్స్ జియో వెల్‌కం ఆఫర్ తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ అంటూ మరో మూడు నెలలు తమ ఆఫర్‌ను కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే మార్చి 31కి ఆ ఆఫర్ కూడా ముగుస్తుండడంతో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తాజాగా రూ.99లతో సభ్యత్వం పొందవచ్చని, అలాగే ఇప్పుడున్న హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌ని ఇకపై రూ.303 టారిఫ్‌తో రీచార్జ్‌తో పొందవచ్చని కూడా చెప్పారు.