దేశ టెలికాం రంగాన్ని ఓ కుదుపు కుదిపిన రిలయన్స్ జియో ఇపుడు వెనుకబడిపోయింది. అదీ 'భీమ్' చేతిలో. దేశంలో నగదు రహిత లావాదేవీలను సులభంగా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భీమ్ (భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ) మొబైల్ యాప్‌నకు త్వరలో అప్‌డేట్ రానుంది. వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సరిచేసి సరికొత్త అప్‌డేట్ ఇవ్వనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేసిన ఈ యాప్‌ను ఇప్పటికే 30 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకొన్నారు. గూగుల్ ప్లేస్టోర్‌లో అగ్రస్థాయికి చేరడమే కాకుండా రిలయన్స్ మై జియో, వాట్సప్‌ను తోసిరాజని ముందంజలో నిలవడం గమనార్హం. భీమ్ యాప్ నిర్వహణ సులభంగానే ఉన్నా కొన్ని సమస్యల్ని ఎదుర్కొన్నట్లు వినియోగదారులు అంటున్నారు.
మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవడం, నగదు బదిలీ చేయడం, చేసిన తర్వాత డబ్బు అవతలి వ్యక్తి ఖాతాలో చేరిందో లేదో తెలియకపోవడం, కొన్ని లావాదేవీలు వాటికవే విఫలమవ్వడం వంటి ఇబ్బందులు ఉన్నట్లు వినియోగదారులు ఎన్‌సీపీఐకి ఫిర్యాదు చేశారు. వీటన్నిటినీ సరిచేసి త్వరలోనే కొత్తవెర్షన్ విడుదల చేస్తామని ఆ సంస్థ ఎండీ, సీఈవో ఏపీ హోతా తెలిపారు. కాగా, భీమ్ యాప్ ద్వారా జనవరి 2నే రూ.3.7 కోట్ల విలువైన 45,000 లావాదేవీలు జరిగినట్టు పేర్కొన్నారు.