రిలయన్స్ జియో ప్రకటనతో.. టెలికాం సంస్థల మధ్య వార్ మొదలైందనే చెప్పాలి. అంతే కాదు.. రిలయన్స్ జియో ప్రకటనతో మిగిలిన టెలికాం కంపెనీల్లో గుబులు మొదలయ్యాయి. మూడు నెలల పాటు అపరిమిత ఉచిత డేటా ఇస్తున్నామని రిలయన్స్ ప్రకటింటచడంతో.. వరుస పెట్టి మరి టెలికామ్ కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తమ వినియోగదారులను వదులుకునేందుకు ఇతర టెలికాం కంపెనీలు సాహసించట్లేదు.
ఇందులో భాగంగా ఐడియా, యునినార్ తదితర సంస్థలు డేటా వాడకం చార్జీలను గణనీయంగా తగ్గించేశాయి. తాజాగా ఎయిర్ టెల్ 3జీ, 4జీ డేటా ధరలను 80 శాతం తగ్గిస్తూ సోమవారం ప్రకటన విడుదల చేసింది. తొలుత రూ. 1,498తో రీచార్జ్ చేసుకుంటే, సంవత్సరం పాటు రూ. 51కే 1జీబీ, 3జీ లేదా 4జీ డేటాను ఎన్నిసార్లయినా ఇస్తామని ఎయిర్ టెల్ ప్రకటించింది. కస్టమర్ల బేస్ తగ్గుతుందనే ఆందోళనతోనే ఎయిర్ టెల్ ఈ ఆఫర్‌ను ప్రకటించింది.
మూడు నెలల ఫ్రీ సేవల కోసం రిలయన్స్ వైపు చూస్తున్న ఎయిర్ టెల్ కస్టమర్లను, రూ. 1500 చెల్లించాలని, ఆపై తక్కువ ధరకు డేటా ఇస్తామని చెప్పడం ఏ మేరకు నిలుపుతుందో వేచి చూడాలని ఫిచ్ రేటింగ్ డైరెక్టర్ నితిన్ సోనీ అన్నారు. ఏది ఏమైనా టెలికం కంపెనీల మధ్య నెలకొన్న వార్‌తో.. తక్కువ ధరకే డేటా వస్తుండడంతో వినియోగదారులు పండగ చేసుకుంటున్నారు.