5జీ నెట్‌వర్క్‌‌లో దక్షిణ కొరియా అదుర్స్.. డౌన్లోడ్ వేగం ఎంతంటే?

సోమవారం, 4 జనవరి 2021 (14:30 IST)
5జీ నెట్‌వర్క్‌ కోసం ప్రపంచ దేశాలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. మౌలిక సదుపాయాల కల్పన కోసం కొట్టుమిట్టాడుతున్నాయి. కరోనా కారణంగా కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ వీలైనంత త్వరగా 5జీ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మన దేశంలో కంపెనీలు వేగంగా అడుగులు వేస్తున్నాయి.

భారత్​లో కూడా ఈ ఏడాది రెండో అర్ధభాగంలో 5జీ నెట్​వర్క్​ను తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. ఆ తర్వాత తమ స్మార్ట్ పోన్లన్నిటినీ 5జీ ప్రాతిపదికనే నిర్మిస్తామని సంస్థ పేర్కొంది. కానీ గత ఏడాది 5జీని ప్రవేశపెట్టిన దక్షిణ కొరియా వేగవంతమైన ఇంటర్నెట్ కల్పన విషయం తనకెవరూ పోటీ లేనివిధంగా ముందుకు దూసుకెళుతోంది.
 
ఇప్పటికే 5జీ ఇంటర్ నెట్ దక్షిణ కొరియాలో అందుబాటులో ఉంది. తాజాగా దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో 5జీ వినియోగం రోజు రోజుకి పెరుగుతున్నట్లు తెలుస్తుంది. 2020 రెండో అర్థభాగంలో ఎస్కె టెలికాం, కెటి కార్ప్, ఎల్జి అప్లస్ కార్ప్ నెట్‌వర్క్ యొక్క 5జీ హై-స్పీడ్ ఇంటర్నెట్ డౌన్‌లోడ్ వేగం 690.47 ఎంబిపిఎస్‌గా ఉంది. అదే తొలి ఆరు నెలల కాలంలో డౌన్‌లోడ్ వేగం 33.91 ఎంబీపీఎస్​గా నమోదవగా.. ఆ వేగం ఇప్పుడు ఇరవై రెట్లకు పైగా పెరిగింది. దీనికి సంబంధించి దక్షిణ కొరియా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్​, ఐసీటీ గణాంకాలు వెల్లడించాయి. 
 
ఆ దేశంలోని మూడు ప్రధాన మొబైల్ నెట్ వర్క్ లైన ఎస్కె టెలికాం 5జీ ఇంటర్ నెట్ డౌన్‌లోడ్ వేగం 795.57 ఎమ్‌బిపిఎస్, కెటి 667.48 ఎమ్‌బిపిఎస్, ఎల్‌జి అప్లస్ 608.49 ఎమ్‌బిపిఎస్ వద్ద ఉన్నాయి. అలాగే ఆ దేశంలో 4జీ ఎల్‌టిఇ డౌన్‌లోడ్ వేగం 153.1 ఎమ్‌బిపిఎస్‌గా ఉంది. 4జీ ఎల్‌టిఇ వేగం కంటే 5జీ ఇంటర్ నెట్ స్పీడ్ నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అక్కడి వార్తా సంస్థ నివేదించింది.
 
ఫలితంగా దక్షిణ కొరియాలో 5జీ వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోయింది. 2022 నాటికల్లా దేశవ్యాప్తంగా 5జీ కవరేజీని అందించాలని లక్ష్యంగా దక్షిణ కొరియా పెట్టుకుంది. దీనికోసం అక్కడి ప్రముఖ టెలీకాం సంస్థలు 5జీ నెట్​వర్క్ కోసం 25.7ట్రిలియన్​ అంటే 24 బిలియన్ డాలర్లను ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు