మేకిన్ ఇండియా: 5జీ టెక్నాలజీ.. మొబైళ్ల తయారీ.. టెలికాం రంగంలో 2 మిలియన్ల ఉద్యోగాలు

బుధవారం, 18 జనవరి 2017 (17:08 IST)
మేకిన్ ఇండియా ప్రభావంతో ఉపాధి అవకాశాలు మెరుగైనాయి. ఇందులో భాగంగా 2017 ఏడాది టెలికాం రంగంలో మాత్రం 2 మిలియన్ల కొత్త ఉద్యోగాలు రానున్నాయని టెలికామ్ రంగ స్కిల్ కౌన్సిల్‌తో కలిసి టీమ్‌లీజ్‌ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ప్రభుత్వం చేపడుతున్న 'మేకిన్‌ ఇండియా' కార్యక్రమంలో భాగంగా కొత్త సర్వీస్‌ ప్రొవైడర్లు రానున్నాయని, ఇవి ఉద్యోగాల సృష్టికి కారణమవుతాయని ఆ అధ్యయనం ద్వారా వెల్లడి అయ్యింది. 
 
తక్కువ ధరలకు మొబైల్ హ్యాండ్ సెట్లను అందించే లక్ష్యంతో తయారీదారులు దృష్టిసారిస్తారు. ఇందుకోసం సర్వీస్ ప్రొవైడర్లు మెరుగైన నెట్‌వర్క్ అందించాల్సి  ఉంటుంది. మరోవైపు పెద్దనోట్ల రద్దు డిజిటల్ వ్యాలెట్లకు మరింత ఊతమిస్తోంది. దీంతో నూతన ఉపాధి అవకాశాలకు లోటుండదని అధ్యయనంలో తేలింది. 
 
మొబైల్‌ హ్యాండ్‌సెట్‌లను తయారు చేసేవారు(1.76మిలియన్లు), అందుకు అనుగుణంగా సేవలను అందించేందుకు సర్వీస్‌ ప్రొవైడర్లు(0.37మిలియన్లు) కావాల్సి ఉంటుంది. ఇక 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో భవిష్యత్‌లో మౌలికరంగంలో కూడా అవకాశాలు వస్తాయని నివేదికలో వెల్లడైంది. 
 
2020-21 నాటికి మౌలికరంగంలో 0.92 మిలియన్ల ఉద్యోగాలు అవసరమవుతాయని, మొత్తంగా చూస్తే ఈ రంగంలో శ్రామికుల సంఖ్య 2021 నాటికి 8.7 మిలియన్లకు చేరనుందని టీమ్‌ లీజ్‌ సర్వీసెస్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నీతి శర్మ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి