ప్రస్తుతం ఫేస్‌బుక్ అధీనంలో ఉన్న వాట్సాప్, ఈ మేరకు ఓ ప్రకటన చేస్తూ, అన్ని ప్రైవేటు మెసేజ్‌లూ 100 శాతం సురక్షితంగా ఉంటాయని, ఈ విషయంలో వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
బిజినెస్ ఖాతాలకు సంబంధించిన సమాచారంపైనే పాలసీ నిబంధనల ప్రభావం ఉంటుందని, బంధుమిత్రులు, స్నేహితులకు పంపే సమాచారం పూర్తి రహస్యమని స్పష్టం చేసింది. వాట్సాప్ ద్వారా బట్వాడా అయ్యే సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో కూడా పంచుకోబోమని స్పష్టంచేసింది.
ఎవరి ప్రైవేటు మెసేజ్‌లను తాము చూడబోమని, కాల్స్‌ను కూడా వినబోమని స్పష్టం చేసిన వాట్సాప్, అయితే కాల్ లాగ్స్‌ను మాత్రం దాచి వుంచుతామని వెల్లడించింది. ఇక తమ మాధ్యమం ద్వారా లోకేషన్ షేర్ చేసినా, ఆ వివరాలను చూడబోమని, ఫేస్‌బుక్‌కు ఇవ్వబోమని, కాంటాక్టుల వివరాలను కూడా ఎవరితోనూ పంచుకోబోమని పేర్కొంది.
ఫేస్‌బుక్ యాజమాన్యంలో ఉన్నా, వాట్సాప్ గ్రూప్ ప్రైవేటు సంస్థగానే వ్యవహరిస్తుందని, యూజర్లు అవసరమనుకుంటే, తమ మెసేజ్‌లను నియమిత సమయం తర్వాత డిలీట్ చేసే ఆప్షన్ పెట్టుకోవచ్చని, ఎప్పుడు కావాలంటే అప్పుడు డేటాను తిరిగి డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తామని తెలిపింది.