వాట్సాప్ పాలసీపై సీసీఐ సీరియస్.. 60రోజుల్లోపు నివేదికకు ఆదేశాలు..

గురువారం, 25 మార్చి 2021 (21:53 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ అప్‌డేటెడ్ ప్రైవసీ పాలసీ, సేవా నిబంధనలపై సమగ్ర దర్యాప్తుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆదేశించింది. దర్యాప్తును కాంపిటీషన్ యాక్ట్, 2002 లోని సెక్షన్ 26 (1) కింద ఆదేశించారు. ఆర్డర్ అందిన 60 రోజుల్లోపు నివేదికను సమర్పించాలని సిసిఐ అధికారులను కోరింది. మీడియా నివేదికలు ద్వారా కేసును సుమోటాగా స్వీకరించినట్లు సిసిఐ తెలిపింది. వినియోగదారుల డేటా రక్షణ విషయంలో వాట్సాప్ కొత్త అప్‌డేట్ పాలసీ రూల్స్ క్రాస్ చేసినట్లు సిసిఐ అనుమానిస్తోంది.
 
వాట్సాప్ ఇటీవల తన గోప్యతా విధానం, నిబంధనలు, అప్‌డేట్ విషయంలో తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కున్న విషయం తెలిసిందే. ఫేస్‌బుక్‌తో డేటాను పంచుకోవడానికి తమ అంగీకారం ఇవ్వాలని.. లేని పక్షంలో ఫిబ్రవరి 8 తర్వాత యూజర్లు తమ ఖాతాలను కోల్పోవాలని వాట్సాప్ వినియోగదారులకు తెలిపింది. దీనిపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో వెనక్కి తగ్గిన యాజమాన్యం యూజర్లు కొత్త పాలసీని అర్థం చేసుకునేందుకు తగినంత సమయాన్ని ఇస్తున్నట్లు పేర్కొంది. మే 15 నుంచి కొత్త పాలసీ అమల్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. 
 
అందుకోసం కొత్త పాలసీ సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ను బ్యానర్‌ రూపంలో యూజర్‌ ముందు ప్రదర్శిస్తుంది. ఈ కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించనివారు మే 15 తర్వాత మెసేజీలు పంపలేరు. అయితే కాల్స్, నొటిఫికేషన్స్ మాత్రం వస్తాయి. భారతీయ చట్టాలకు లోబడే ప్రైవసీ పాలసీని రూపొందించినట్లు కేంద్రానికి వాట్సాప్ వివరణ ఇచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు