వచ్చే 3-6 నెలల మధ్య కాలంలో మోనిటర్ మినహా రూ.5 వేల రూపాయలకే లభించే కంప్యూటర్ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లుగా ప్రసిద్ధ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ ప్రకటించింది. చౌకధరతో రూపొందించిన ఆటమ్ ప్రాసెసర్ సహాయంతో కంప్యూటర్ ధరలు గణనీయంగా పడిపోనున్నాయని ఇంటెల్ పేర్కొంది.
వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతుండగా మరోవైపు కంప్యూటర్ల ధరలు రోజురోజుకూ తగ్గుతున్నాయని ఇంటెల్ ఆసియా పసిఫిక్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ నవీన్ షెనాయ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 3 నుంచి 6 నెలల కాలంలో అయిదు వేల రూపాయల ధరకే కంప్యూటర్లు లభ్యం కానున్నాయని నవీన్ తెలిపారు.
ఈ సంవత్సరం మొదట్లో చౌకధరలతో డెస్క్‌టాప్ మరియు లాప్టాప్ కంప్యూటర్ల కోసం ఇంటెల్ సంస్థ ఆటమ్ పేరుతో ఓ కొత్త ప్రాసెసర్‌ను ప్రారంభించింది. అలాగే ప్రభుత్వం, పారిశ్రామిక సంస్థలు, ప్రైవేట్ సంస్థలతో కూడిన పరిశ్రమ వ్యాప్త ఉద్యమాన్ని కూడా ఇంటెల్ ఇండియా ప్రారంభించింది.
ఇంటర్నెట్కు ప్రజలను పెద్ద ఎత్తున కనెక్ట్ చేయడం కోసం ప్రజలను, వనరులను, మౌలికవసతుల కల్పనను ఇంటెల్ గత కొంతకాలంగా కూడగడుతోంది. ఈ సందర్భంగా కేంద్ర ఐటి మంత్రి ఎ. రాజా మాట్లాడుతూ ఇంటర్నెట్ భారత్‌ను వచ్చే దశాబ్దంలోకి తీసుకెళుతుందని ప్రకటించారు.
చౌకధరల ప్రాతిపదికన తయారయ్యే ఈ సరికొత్త కంప్యూటర్లు వర్డ్, ఎక్సెల్, ఇ-మెయిల్స్, సాధారణ గేమ్‌లు, మరియు నెట్ సామర్థ్యత వంటి ప్రాథమిక కంప్యూటింగ్‌కు మద్దతు ఇస్తున్నాయి. అత్యంత సూక్ష్మ ప్రాసెసర్ ఆటమ్ ఆధారంగా తయారైన నమూనా కంప్యూటర్లను జెన్యూన్ ఇంటెల్ డీలర్లే అసెంబుల్ చేసి ప్రదర్శించారు. వీటికి ఇంటర్నెట్ కేంద్రక డెస్క్‌టాప్ డివైస్లుగా పిలుస్తున్నారు.
ప్రస్తుతం అసెంబుల్ చేసిన అన్ బ్రాండెడ్ ప్రాధమిక స్థాయి పర్సనల్ కంప్యూటర్లు 12 వేల నుంచి 13 వేల ధర వద్ద లభ్యమవుతున్నాయి. 2005లో హెచ్‌సిఎల్ కంప్యూటర్ పూర్తి స్థాయి కంప్యూటర్ను రూ.9,900 ధరకే మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం జెనీత్ కంప్యూటర్ సైతం పదివేల రూపాయల కంటే తక్కువ ధరకే కంప్యూటర్ను విడుదల చేసింది.
మూడు నాలుగేళ్ల క్రితం కంప్యూటర్ కొనానంటే 20 నుంచి 25 వేల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో పోలిస్తే ఇప్పుడు లభిస్తున్న చౌక కంప్యూటర్లు లక్షలాది మంది వినియోగదారులకు చేరువ కానున్నాయని పరిశీలకుల వ్యాఖ్య.