ప్రభుత్వాన్ని పడగొట్టనంటూ చెపుతూ వస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప ధర్నాలో రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రైతులు పంటలు ఎండిపోతూ అల్లాడిపోతుంటే పట్టని ఈ పనికిమాలిన ప్రభుత్వం దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని అన్నారు.
మంగళవారం రైతుల కరెంటు కష్టాలపై ధర్నాలు నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కిరణ్ సర్కారుపై నిప్పులు చెరిగింది. ఈ ప్రభుత్వం రైతులను, ప్రజలను గాలికి వదిలేసి కుర్చీ పట్టుకుని వేలాడుతోందని మండిపడింది.
కడప ధర్నాలో జగన్ మాట్లాడుతూ... అసలు కరెంటు ఎప్పుడు తీస్తారో.. ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొని ఉందన్నారు. అడిగినా సరైన సమాధానం చెప్పేవారు లేరన్నారు. ఇటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఒకటేనని మండిపడ్డారు.