కిరణ్ చెవిటి సర్కార్‌ను నా దీక్షలు కదిలించడం లేదు: జగన్
గురువారం, 12 జనవరి 2012 (18:24 IST)
FILE
రైతుల కోసం ఢిల్లీ నుంచి గల్లీ దాకా దీక్షలపై దీక్షలు చేస్తున్నా ఈ చెవిటి ప్రభుత్వానికి ఎంతమాత్రం వినబడటం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మండిపడ్డారు. రైతు సమస్యలపై 45 గంటలపాటు దీక్ష చేసిన జగన్, దీక్ష విరమించిన అనంతరం కిరణ్ సర్కార్‌ను తూర్పారబట్టారు.
రైతులకు అండగా నిలబడాల్సిన ఈ ప్రభుత్వం, రైతు వెన్ను విరిచేవిధంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ వేళ.. రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు పండిన పంటకు గిట్టుబాటు ధర లేక కుంగిపోతున్నాడన్నారు. వరి పంటకు అయ్యే ఖర్చు 25 వేల రూపాయలైతే వచ్చేది 12 వేలే. అదేవిధంగా పసుపు పంటకోసం అన్నదాతలు ఎకరాకు 1.20 లక్షలు ఖర్చు చేస్తే వారికి వస్తున్నది 60 వేలే. ఇలాంటి పరిస్థితినే మిగిలిన అన్ని పంటల రైతులూ ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేని పరిస్థితిలో ఈ చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఉన్నది. అందుకే ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రయత్నం చేశామన్నారు. అయితే చంద్రబాబు నాయుడు దురుద్దేశంతో అవిశ్వాసం ప్రవేశపెట్టి ప్రభుత్వాన్ని నిలబడేలా చేశారన్నారు.
ఐనప్పటికీ రైతుల తరపున తాను చేస్తున్న దీక్షను చూసైనా ప్రభుత్వంలో మానవత్వం మేల్కొని ఆదుకుంటుందన్న ఆశ ఉన్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెవిటిది కనుక వినబడదు.. కనీసం కేంద్రానికైనా వినబడి రైతులకు ఏదైనా మేలు చేస్తుందన్న ఆశతో ఉన్నానంటూ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.