జగన్ మోహన్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. తన తండ్రి దివంగత నేత వైఎస్సార్ రెక్కల కష్టంతోనే కేంద్రంలో సోనియా గాంధీ రాజ్యమేలుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్సార్ ను ప్రజలు దేవుడిలా చూసుకుంటూ తమ గుండెల్లో దాచుకున్నారని చెప్పుకొచ్చారు.
ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని అడుగడుగునా నిలదీయాల్సిన ప్రధానప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని చూస్తే సిగ్గు వేస్తోందన్నారు. రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వంతో బాబు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు సహాయపడుతూనే ఉన్నారని విమర్శించారు. వైఎస్సార్ ఉంటే ఇటువంటి పరిస్థితి దాపురించేది కాదని అన్నారు.
గుంటూరు జిల్లాలో జగన్ చేస్తున్న ఓదార్పు యాత్ర 36వ రోజుకు చేరుకుంది. కాగా ఈ ఓదార్పును ఎన్నాళ్లు చేస్తారంటూ కాంగ్రెస్ నాయకులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.