జగన్ ఎఫెక్ట్‌తోనే తెరాస విలీనమన్నా తెలంగాణకు నోనా...?!!

గురువారం, 8 నవంబరు 2012 (17:52 IST)
FILE
తెలంగాణ తెరపైకి మరో కొత్త వాదన దూసుకొచ్చింది. తాజాగా కేసీఆర్ 2014 ఎన్నికల మాట చెప్పడంతోపాటు ఇంతవరకూ జగన్ పార్టీని పల్లెత్తు మాట అనని కేసీఆర్ ఆ పార్టీని భూస్థాపితం చేయాలనడం గమనార్హం. తెలంగాణ ఏర్పాటు కోసం తనను ఢిల్లీకి పిలిపించి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనీ, ఇక నుంచి కాంగ్రెస్ పార్టీకి బొంద పెట్టే పనిలోనే నిమగ్నమవుతానని కేసీఆర్ చెపుతున్నారు.

కాగా తెలంగాణ ఏర్పాటు అంశంలో జగన్ పార్టీ అభిప్రాయాలను కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నదని అంటున్నారు. తెలంగాణలో జగన్ తండ్రి వైఎస్సార్ హవా ఇంకా నడుస్తోందనీ, దానితోపాటుగా షర్మిల పాదయాత్ర, 2014 ఎన్నికలకు కూతవేటు దూరంలో జగన్ జైలు నుంచి విడుదలయితే.. ఇక వైకాపా ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరనీ, ఆ తుఫానులో పడి కేసీఆర్, తెదేపా, కాంగ్రెస్ పార్టీలు కొట్టుకుపోతాయన్న సంకేతాలు వచ్చాయనీ, అందువల్లనే కేసీఆర్ డిమాండ్లను పక్కకు పెట్టి కాంగ్రెస్ మౌనముద్ర దాల్చిందని అంటున్నారు.

ఇప్పటికే వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, జగన్ సతీమణి భారతి రెండు దఫాలు ఢిల్లీకి వెళ్లి వచ్చారు. వీరు జగన్ బెయిల్ కోసమే వెళ్లారా.. లేదంటే జగన్ మాటగా తెలంగాణపై తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు వెళ్లారా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇకపోతే తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. కానీ వాటిని ఓట్ల రూపంలో ఎలా మార్చుకుంటారన్నదే పెద్ద సవాలుగా మారింది. చూడాలి... వచ్చే 2014 ఎన్నికల్లో ఎవరి తల రాతలను ఓటర్లు ఎలా మార్చేస్తారో..?!!

వెబ్దునియా పై చదవండి