జగన్ రైతు దీక్ష.. ఎగబడుతున్న తెలంగాణ జనం.. తెరాస మటాష్..!!

బుధవారం, 11 జనవరి 2012 (11:23 IST)
WD
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో రైతుదీక్ష చేస్తున్న సభాస్థలికి తెలంగాణ జనం ఎగబడి వస్తున్నారు. రైతులకోసం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షకు మద్దతు తెలుపుతున్నారు.

తొలుత జగన్ దీక్షకు తెలంగాణ వాదుల నుంచి భారీ ఎత్తున నిరశన ఎదురవుతుందని భావించారు. కానీ అలాంటి సీన్ ఎక్కడా కనిపించలేదు. పైపెచ్చు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా జగన్ కు మద్దతు తెలిపేందుకు రైతులు ఎగబడి రావడం కొన్ని పార్టీలకు మింగుడు పడటం లేదు.

ముఖ్యంగా తెరాస నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లు కనబడుతోంది. తెరాస నాయకుడు హరీశ్ రావు జగన్‌ది దొంగ దీక్ష అని చెపుతున్నప్పటికీ ప్రజలు ఆయన మాటలను పట్టించుకున్నట్లు కనబడటం లేదు. ఇదిలావుంటే.. ఇదే ఊపుతో తెలంగాణ పోరుబాట పట్టాలని జగన్ వర్గం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ ఇలాంటి యాత్ర కనుక మొదలుపెడితే.. తెరాసతో సహా కాంగ్రెస్ పార్టీకి కూడా పునాదులు కదులుతాయని అంటున్నారు.

ఏదేమైనప్పటికీ తొలిసారిగా తెలంగాణ ప్రాంతంలో జగన్ చేస్తున్న దీక్షకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే జగన్ తెలంగాణ పోరుబాట చేస్తారనే ప్రకటన వచ్చిందని అంటున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో..?!!

వెబ్దునియా పై చదవండి