కోనేరు ప్రసాదులానే జగన్‌ను కూడా సీబీఐ అరెస్టు చేస్తుందా..?
శుక్రవారం, 4 నవంబరు 2011 (12:48 IST)
FILE
ఎమ్మార్ విల్లాల అమ్మకాల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ అభియోగాలు ఎదుర్కొంటున్న స్టైలిష్ హోం ఎండీ కోనేరు ప్రసాద్‌ను గురువారం విచారణ నిమిత్తం పిలిపించిన సీబీఐ ప్రాధమిక ఆధారాలున్నందున అరెస్టు చేస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా ఇపుడు జగన్‌ను కూడా విచారణ నిమిత్తం పిలిచి అరెస్టు చేస్తారనే వార్తలు ఊపందుకున్నాయి.
మరోవైపు కోనేరు ప్రసాద్ అరెస్టుతో రాష్ట్రంలోని బడా నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కోనేరు నోరు విప్పితే ఎవరి చేతులకు బేడీలు పడతాయోనన్న భయంలో వారు ఉన్నట్లు సమాచారం. ట్రైమాక్స్ అధినేతగా, ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడమే కాక స్టైలిష్ హోం సంస్థను నెలకొల్పి వందల కోట్ల రూపాయలను చట్టవిరుద్ధంగా తన ఖాతాలో జమ చేసకున్నారన్నది ప్రసాద్‌పై ఉన్న ప్రధాన ఆరోపణ.
ప్రభుత్వం లెక్కల్లో గజం ఐదు వేల రూపాయలు అన్నట్లుగా చూపించి, కొనుగోలుదారులకు మాత్రం పదివేల నుంచి 50 వేల రూపాయల వరకు విక్రయించారన్నది అభియోగం. గురువారం కోనేరును విచారణ నిమిత్తం పిలిపించి సీబీఐ అరెస్టు చేయడం విశేషం. కోనేరు అరెస్టుతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నదని అంటున్నారు.
ఒకప్పుడు చంద్రబాబుకు, ఆ తర్వాత వైఎస్సార్‌కు బాగా సన్నిహితంగా మెలిగిన కోనేరు నోరు విప్పితే చాలామందికి ఇబ్బందులు తప్పవంటున్నారు. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ.