దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి సాహసోపేత ప్రకటన చేశారు. తెలంగాణ అంశంలో తనపై ఉన్న వ్యతిరేకభావాన్ని తుడిచి వేసుకునే ప్రయత్నం చేశారు. పనిలోపనిగా తన ఓదార్పు యాత్రను తెలంగాణ ప్రాంతంలో ప్రారంభించాలన్న బలమైన ఆకాంక్షను ఆయన ఈ ప్రకటన ద్వారా వ్యక్తం చేశారు.
అందుకే.. తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారిపై తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేయరని, కోట్లాది మంది ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించాలంటూ సెంటిమెంట్ వచనాలు పలికారు. తెలంగాణ రాష్ట్ర సాధన ప్రజల బలమైన ఆకాంక్ష అని, అందుకోసం రాజీనామాలు చేసిన వారిని గౌరవిస్తామని జగన్ ఓ ప్రకటనలో పేర్కొన్న విషయం తెల్సిందే.
తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు ఏ పార్టీ తరపున బరిలోకి దిగినా వారిపై పోటీ పెట్టరాదన్నదే తమ నిర్ణయమని ఆయన అందులో స్పష్టం చేశారు. స్వార్థపూరిత, అవకాశవాద రాజకీయాలకు దూరంగా ఉండే వైఎస్సార్ కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
జగన్ చేసిన ఈ వ్యూహాత్మక ప్రకటనకు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు టి కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి, టి జేఏసీ, సీపీఐ, తెలంగాణ ప్రజా సంఘాలు స్వాగతిస్తుండగా, తెలుగుదేశం పార్టీ మాత్రం మండిపడుతోంది. కేసీఆర్ - జగన్ మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమే ఈ ప్రకటన సారాంశమని తెదేపా అధినేత చంద్రబాబు శనివారం అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో తనకు బలమైన పట్టుకొమ్మలా ఉన్న పరకాల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖకు ఇతర తెలంగాణవాదుల మద్దతును కూడగట్టే పనిలో జగన్ నిమగ్నమయ్యారన్నది ఈ ప్రకటన రుజువు చేస్తోంది. ఇతర స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై తాము పోటీకి దింపక పోతే.. తమ పార్టీ తరపున పోటీ చేసే కొండా సురేఖపై తెరాస పోటీకి దించదని, తద్వారా సురేఖను గెలిపించుకోవచ్చన్నది జగన్ ఎత్తుగడగా ఉంది. అందుకే.. ఆయన సెంటిమెంట్ పంచ్ విసిరారు.
అంతేకాకుండా, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే రాజేశ్వర్‌డ్డి అకాల మృతితో జరిగే ఉప ఎన్నికలో ఆయన సతీమణిని తమ పార్టీ తరపున పోటీ చేయాలని కూడా జగన్ విజ్ఞప్తి చేశారు. ఒకవేళ వేరే పార్టీ నుంచి పోటీ చేసినా పాలమూరు స్థానం నుంచి పోటీ పెట్టబోమని ఆయన ప్రకటించారు. ఈ వ్యూహాత్మక ప్రకటనతో జగన్.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదన్న సంకేతాలు పంపించినట్టేనని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.