జగన్‌కు తెలుగు మీడియా ఫోబియానా..?! ప్రశ్నిస్తే పారిపోతారా...?!!
బుధవారం, 7 డిశెంబరు 2011 (14:13 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ జగన్‌కు తెలుగు మీడియా ఫోబియా ఉందని పలువురు విలేకరులు బాహాటంగానే అంటున్నారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత మంగళవారంనాడు మీడియా ముందుకు వచ్చిన జగన్, అసెంబ్లీలో తన వర్గం ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానికి అనుకూలంగా, అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.
తను మాట్లాడదలచుకున్నది అయిపోగానే వెంటనే లేచెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఓ విలేకరి... మీ కోసం రాజీనామా చేసిన 29 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 18 మందే రావడానికి కారణమేంటని అడగ్గా జగన్ అసహనానికి గురయ్యారు. నేషనల్ మీడియాతో మాట్లాడాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ పరిణామంతో విలేకరులు మండిపడ్డారు. తాము అడిగిన ప్రశ్నలకు బదులివ్వకుండా జగన్ వెళ్లిపోవడాన్ని తప్పుపట్టారు. ప్రశ్నలకు జవాబులు చెప్పాలంటే జగన్ మోహన్ రెడ్డికి వణుకు పుడుతుందని మరికొందరు వ్యాఖ్యానించారు. మొత్తమ్మీద తెలుగు మీడియా వేసే లోతైన ప్రశ్నలకు జగన్ జవాబులు చెప్పలేరని, ఒకవేళ చెప్పాల్సి వస్తే ఎక్కడో ఓ చోట దొరికిపోతారని అక్కడివారు అనుకోవడం కనిపించింది.