మ్యాగీ నూడుల్స్‌లో రసాయనాలున్నట్లు పరిశోధనల్లో వెల్లడి కావడంతో.. వాటిని పిల్లలకు పెట్టాలంటేనే తల్లిదండ్రులు జడుసుకుంటున్నారు. అయితే షాపుల్లో అమ్మే నూడుల్స్ కంటే ఇంట్లోనే పోషకాలతో కూడిన నూడుల్స్‌ను తయారు చేయొచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. అదెలాగంటే.. షాపుల్లో లభించే ఇన్‌స్టెంట్ నూడుల్స్‌ను కొనడం పూర్తిగా మానేయాలి. ఒకవేళ పిల్లలు నూడుల్స్ తినాల్సిందేనని మారాం చేస్తే.. ప్యాకెట్‌లో ఉండే నూడుల్స్‌ను ముందుగా బాగా వేడిచేసిన నీటిలో ఉడికించి ఆ నీటిని పారబోయాలి. తర్వాత ఆ నూడుల్స్‌లో కూరగాయల్ని చేర్చి పిల్లలకు ఇవ్వొచ్చు.
ఇలా చేయడం ద్వారా ప్యాకెట్ నూడుల్స్‌లో చేర్చిన టేస్ట్ మేకర్ నశిస్తుంది. సాధారణంగా టేస్ట్ మేకర్‌లో మోనోసోడియం, ఉప్పు వంటివి అధికశాతం ఉంటాయి. వీటిని పిల్లలు తీసుకోకపోవడం మంచిది. అలా వేడినీటిలో ఉడికించి నీటిని వంపేసిన నూడుల్స్‌లో క్యాప్సికమ్, క్యాబేజీ వంటివి చేర్చితే నూడుల్స్ టేస్ట్ వచ్చేస్తుంది. లేకుంటే నూడుల్స్ జోలికి వెళ్లకుండా.. షాపుల్లో లభించే రాగి నూడుల్స్, గోధుమలతో తయారైన నూడుల్స్‌ను పిల్లలకు అలవాటు చేయొచ్చు.
ఇకపోతే.. గోధుమపిండి, ఉప్పు, కోడిగుడ్డును బాగా చపాతీ పిండిలా ప్యాన్‌లో మిక్స్ చేసుకుని.. చపాతీలా వొత్తుకుని రోల్ చేసి చివర్లో సన్నసన్నని నూడుల్స్‌గా కట్ చేసుకుని వాటిని పక్కనబెట్టుకోవాలి. ఈ నూడుల్స్‌ను వేడినీటిలో ఉడికించి ఆపై కూరగాయలతోనైనా సర్వ్ చేస్తే హోమ్ మేడ్ నూడుల్స్ పిల్లల ఆరోగ్యానికి మేలు చేసినట్లవుతుంది.