మరో ఘనత సాధించిన ఈసీ... అభ్యర్థి పేరు పక్కన బటన్ లేకుండానే ఈవీఎమ్

శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (16:08 IST)
ఈ ఎన్నికల్లో రకరకాల చిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగాననే తమిళనాడు ఎన్నికల్లో ఒక విచిత్రం చోటుచేసుకుంది. కడలూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ స్టేషన్‌లో అభ్యర్థి పేరు పక్కన ఓటు వేయడానికి అసలు బటనే లేదు. కడలూరు లోక్‌సభకు టీటీవీ దినకరన్‌కు చెందిన ఏఎమ్ఎమ్‌కే పార్టీ అభ్యర్థిగా కాశీ తంగవేల్ పోటీ చేస్తుండగా ఆయనకు 16వ స్థానం కేటాయించారు. 
 
అందుకు తగ్గట్టుగా ఈవీఎంలో అభ్యర్థి పేరు, పక్కన ఫొటోలు కూడా ఏర్పాటు చేశారు. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయడానికి పక్కన ఓ బటన్ ఉటుంది. అయితే, ఆ పోలింగ్ స్టేషన్‌లోని ఈవీఎంలో మిగిలిన 15 మంది పేర్ల పక్కన బటన్ ఉంది. కానీ, ఏఎమ్ఎమ్‌కే అభ్యర్థి పేరు పక్కన మాత్రమే బటన్ కనిపించలేదు.
 
దీంతో ఓటు వేయడానికి వెళ్లిన కొందరు దాన్ని గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం పార్టీల నేతలకు కూడా తెలియడంతో అందరూ అక్కడికి చేరుకుని నిరసన తెలియజేసారు. దీంతో ఎన్నికల అధికారులు వెంటనే స్పందించి ఆ పోలింగ్ స్టేషన్‌లో పోలింగ్‌ను వాయిదా వేశారు. సాధారణంగా పోలింగ్ మొదలు పెట్టడానికి ముందే ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను తనిఖీ చేసి, మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. అందులో ఏ అభ్యర్థికి వేసిన ఓటు అతనికే పడుతున్నాయా లేదా అని పరిశీలిస్తారు. అయితే, అసలు అభ్యర్థి పేరు పక్కన బటనే లేకపోవడాన్ని కూడా ఎన్నికల సిబ్బంది గుర్తించలేకపోవడంపై ఏఎమ్ఎమ్‌కే కార్యకర్తలు మండిపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు