దేశంలో 17వ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా, మూడో దశ పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116 లోక్‌సభ సీట్లకు పోలింగ్ జరుగుతోంది. గుజరాత్, కేరళ, గోవాలలో అన్ని స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో 14, కర్ణాటకలో 14, ఉత్తరప్రదేశ్ లో 10, ఛత్తీస్‌గఢ్‌లో 7, ఒడిషాలో 6, పశ్చిమ బెంగాల్ లో 5, బీహార్‌లో 5, అస్సాంలో 4, జమ్మూకాశ్మీర్‌లో 1, త్రిపురలో 1 స్థానానికి పోలింగ్ జరగనుంది. కేంద్ర పాలిత ప్రాంతాలు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలలో పోలింగ్ ప్రారంభమైంది.
మూడో దశ ఎన్నికల ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. తూర్పు త్రిపుర సీటు పోలింగ్ వాస్తవానికి ఏప్రిల్ 18న జరగాల్సి ఉండగా అక్కడి శాంతిభద్రతల పరిస్థితి స్వేచ్ఛగా నిజాయితీగా ఎన్నికలు నిర్వహించేందుకు అనువుగా లేదని ఎన్నికల సంఘం ఏప్రిల్ 23కి వాయిదా వేసింది. దీంతో ఆ స్థానానికి కూడా సోమవారం పోలింగ్ జరుగుతోంది.
ఇతర కీలక అభ్యర్థులలో సమాజ్ వాదీ పార్టీ పెద్దదిక్కు ములాయం సింగ్ యాదవ్ ఉన్నారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్ పురీ నుంచి నిలబడ్డారు. ప్రగతిశీల్ సమాజ్ వాదీ పార్టీ (లోహియా) అధ్యక్షుడు శివపాల్ సింగ్ యాదవ్ ఫిరోజాబాద్ నుంచి రంగంలో నిలిచారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే మహారాష్ట్రలోని బారామతి నుంచి పోటీ చేస్తున్నారు.
ఇదిలావుడంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని రణిప్‌లో ఉన్న నిషాన్ హైస్కూల్ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. ఈ సమయంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా ఆయన వెంట ఉన్నారు. అంతకముందు గాంధీ నగర్ వెళ్లిన మోడీ.. తన తల్లి నివాసానికి చేరుకుని అక్కడ ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.