మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీని లక్ష్యంగా చేసుకుని భారతీయ జనతా పార్టీ సంచలన ఆరోపణలు చేస్తోంది. మొన్నటికిమొన్న రాజీవ్ గాంధీ నంబర్ వన్ అవినీతిపరుడంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. నిన్న భారత రక్షణ శాఖకు చెందిన ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌకను రాజీవ్ ఫ్యామిలీ ఓ ట్యాక్సీలా వాడుకుందని చెప్పారు. ఇపుడు మరో అడుగు ముందుకేసి బీజేపీ.. రాజీవ్ ఆదేశాల మేరకే సిక్కులు ఊచకోత జరిగినట్టు ఆరోపించారు.
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా, పంజాబ్ రాష్ట్రంలోని 13 పార్లమెంటరీ నియోజకవర్గాలలో మే 19వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ సందర్భంగా సిక్కుల ఊచకోత అంశాన్ని బీజేపీ తెరపైకి తెచ్చింది. 1984లో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య చేసిన అనంతరం సిక్కులను ఊచకోత కోశారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆఫీసు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సిక్కులను ఊచకోత కోశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.