తన సోదరుడికి ఓటు వేస్తేనే నీళ్లిస్తామంటూ కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఈ వ్యాఖ్యలు లోక్‌సభ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంటూ పోలీసు కేసు నమోదైంది. తన సోదరుడు డీకే సురేశ్‌కు ఓటు వేస్తేనే కావేరీ నది నుంచి నీటిని ఇస్తానని బెంగళూరు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినందుకు గాను ఆయనపై ఈ కేసు నమోదైంది. లోక్‌సభ ఎన్నికల్లో డీకే సురేశ్ బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. సోదరుడి తరపున డీకే శివకుమార్ ఇటీవల ఓ హౌసింగ్ సొసైటీలో ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
'నేను ఇక్కడికి ఓ బిజినెస్ డీల్ కోసం వచ్చాను. నా సోదరుడు సురేశ్‌ను మీరు గెలిపిస్తే మూడు నెలల్లో మీ ప్రధాన సమస్యను పరిష్కరిస్తాను. కావేరీ నదీ జలాలు సరఫరా చేసి మీకు అవసరమైన నీటిని కేటాయిస్తాం' అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు బీజేపీ వీడియోను కూడా విడుదల చేసింది. డీకే శివకుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని... తన సోదరుడి కోసం ఓట్లను దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ మండిపడింది.