బీజేపీలో చేరనున్న సినీ నటి సుమలత... కానీ కుమార స్వామికి మద్దతు!!

ఠాగూర్

బుధవారం, 3 ఏప్రియల్ 2024 (17:06 IST)
సినీ నటి సుమలత భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆమె బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె మాండ్య స్థానం నుంచి స్వతంత్ర ఎంపీగా ఉన్నారు. ఆమె తాను బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మాండ్య నుంచి ఎన్డీయే అభ్యర్థిగా బరిలో ఉన్న జేడీఎస్‌ నేత కుమారస్వామికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'నేను మాండ్యను వీడను. నేను మీ కోసం పనిచేయడం రాబోయే రోజుల్లో చూస్తారు. భాజపాలో చేరాలని నేను నిర్ణయించుకున్నా' అని తన మద్దతుదారులతో జరిగిన సమావేశంలో సుమలత వెల్లడించారు. 
 
'నేను ఒక స్వతంత్ర ఎంపీ అయినా కేంద్ర ప్రభుత్వం మాండ్యకు రూ.4 వేల కోట్లు గ్రాంటు ఇచ్చింది. ఈ నియోజకవర్గం విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకొనేముందు భాజపా నేతలు ఎప్పుడూ నన్ను విశ్వాసంలోకి తీసుకుంటున్నారు. భాజపాకు మీ అవసరం ఉంది. ఈ పార్టీని వదులుకోవద్దు అని ప్రధాని మోడీ కోరినప్పుడు.. ఆయన మాటను నేను గౌరవించాలి కదా. నన్ను వేరే జిల్లా నుంచి పోటీ చేయాలని భాజపా ఆఫర్‌ ఇచ్చినా తిరస్కరించా. మాండ్య జిల్లాకు కోడలిగా ఇక్కడే ఉంటాను. నా మద్దతుదారులు కొందరు నన్ను కాంగ్రెస్‌లో చేరాలని కోరారు. అయితే, ఆ పార్టీకి సుమలత అవసరం ఇప్పుడు లేదు.. ఇకపైనా రాదంటూ ఒక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అన్నాక.. ఆత్మాభిమానం ఉన్న వ్యక్తిగా ఆ పార్టీలోకి వెళ్లాలని ఎలా అనుకుంటాం' అని సుమలత తెలిపారు.
 
అలాగే, గత ఐదేళ్లలో మాండ్యకు చేసిన పనుల్ని ఈ సందర్భంగా సుమలత వివరించారు. లోక్‌సభ ఎన్నికలంటే చిన్న పిల్లల ఆట కాదని.. అందులోనూ ఒక మహిళ స్వతంత్ర ఎంపీగా గెలుపొందడమంటే మరింత సవాల్‌తో కూడుకున్నదన్నారు. అయినా గానీ, మాండ్య ప్రజలు గత ఎన్నికల్లో తనను ఆశీర్వదించి ఎంపీగా అవకాశం కల్పించారని గుర్తు చేసుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలత భాజపా మద్దతుతో.. కుమారస్వామి తనయుడు నిఖిల్‌ను ఓడించిన విషయం తెలిసిందే. 
 
గతేడాది మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె భాజపాకే మద్దతు ప్రకటించారు. ఆ సమయంలోనే ఆమె కమలదళంలో చేరబోతున్నారంటూ పెద్దఎత్తున ఊహాగానాలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆమె భాజపాలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తాజాగా ప్రకటించారు. గతేడాది సెప్టెంబర్‌లో మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత దేవెగౌడ ఎన్డీయే కూటమిలో చేరిన విషయం తెలిసిందే. ఈ లోక్‌సభ ఎన్నికల్లో 25 చోట్ల భాజపా.. మాండ్యతో పాటు మూడు స్థానాల్లో జేడీఎస్‌ బరిలో దిగుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు