నా హృదయంలో నిదురించే చెలీ...

FileWD















నీవంటూ లేకుంటే...
నాకోసం రాకుంటే...
సాగర గర్భంలోనే నిక్షిప్తమైపోయిన ముత్యంలా... నేనూ మిగిలిపోయేవాడిని.

ప్రేమంటూ లేకుంటే...
నీపై నాకది రాకుంటే...
గమ్యమెరుగని పయనంలా... నా జీవనపయనం ఏ చీకటిరాజ్యానికో చేరేది.

నాలో మనసంటూ లేకుంటే...
అందులో నీ తలపే రాకుంటే...
వసంతమెరుగని వనంలా... నా హృదయం సైతం ఏనాడో బీడుగా మారిపోయేది.

కానీ... ఏ దేవుడి వరమో తెలియదుగానీ... ఏ జన్మ సుకృతమో ఎరుగనుగానీ...
మది సామ్రాజ్యానేలే రాణిలా... నా గుండె గూటికి చేరావు. స్వప్న మెరుగని నిద్రలా... చినుకునెరగని ఏడారిలా... సాగిపోతున్న నా జీవితానికి రంగుల లోకానివయ్యావు.

రాయిలాంటి నాలో రాగాలు నింపావు. పలుకే కరువైన నా మది పలికిన తొలి వాక్యానికి ఆది అక్షరం నీవయ్యావు. మాటలైనా రాని నేను నీపై కవితలల్లేందుకు ప్రేరణవయ్యావు. నా నిదురలో మధురమైన స్వప్నానివి నీవయ్యావు.

కమ్మనైన నా తలపుకు జ్ఞాపకానివి నీవైనావు. అందుకే... చెలీ నీకోసం... నీతలపుకోసం... నీవలపు కోసం... నీతో సాగే జీవన పయనం కోసం... సదా సిద్ధంగా ఉండే నీ...

వెబ్దునియా పై చదవండి