జిన్నా మద్దతుదారులందరిపై చర్యలు: రాజ్‌నాథ్

మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నేత జశ్వంత్ సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సమర్థించారు. పాకిస్థాన్ జాతిపిత మహమ్మదలీ జిన్నాను ప్రశంసిస్తూ జశ్వంత్ సింగ్ రాసిన "జిన్నా: ఇండియా, పార్టిషన్, ఇండిపెండెన్స్" పుస్తకం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

ఈ పుస్తకంపై జశ్వంత్ సింగ్ వ్యక్తపరిచిన అభిప్రాయాలు బీజేపీలో ప్రకంపనలు సృష్టించాయి. దీంతో బీజేపీ అధిష్టానం యశ్వంత్ సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. పార్టీలో జిన్నాకు మద్దతుగా నిలిచేవారందరిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిన్నా సిద్ధాంతాలకు బీజేపీ వ్యతిరేకం.

ఆయనను కీర్తించడం పార్టీ కట్టుబాట్లను ఉల్లంఘించడమేనని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. పార్టీలో జిన్నాకు మద్దతుపలికేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. దేశ విభజనకు, ఆ తరువాత జరిగిన భయానక పరిణామాలకు కారణమైన జిన్నాను పొగిడేందుకు ఎవరు సాహసించినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిన్నాతో పార్టీకి సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయని తేల్చిచెప్పారు.

వెబ్దునియా పై చదవండి