శబిరమల మకరజ్యోతిపై సుప్రీంలో పిటిషన్ దాఖలు!

శబరిమలలో సంక్రాంతి రోజున వెలిగే మకరజ్యోతిపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. మకర జ్యోతి మానవ కల్పితమా కాదా అనే విషయాన్ని శబరిమల దేవస్థానం ప్రజలకు స్పష్టం చేయాలని న్యాయవాది దీపక్ ప్రకాష్ దాఖలు చేసిన పిటిషన్‌లో డిమాండ్ చేశారు. మకరజ్యోతి నిజమని భావించి దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు శబరిమలకు వెళ్తున్నారు.

భారత రాజ్యాంగ చట్టం దైవభక్తితో వచ్చే భక్తులకు పటిష్ట భద్రత కల్పిచాలి. అయితే మకరజ్యోతి మానవ కల్పితం కాదనే నమ్మకంతో శబరికి వెళ్లిన లక్షలాది భక్తుల మధ్య ఏర్పడిన తొక్కిసలాటలో ఈ ఏడాది 106 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. గత 1999వ సంవత్సరం 53 మంది మరణించారు.

ఇంకా మకరజ్యోతి మూడుసార్లు వెలిగి ఆరిపోవడంలో మానవ కల్పితం ఉందని, ఇందులో కేరళ విద్యుత్ శాఖ కీలక పాత్ర పోషిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుచేత మానవకల్పితమైన మకరజ్యోతితో మూడనమ్మకాలు వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ప్రకాష్ తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

కాగా మకరజ్యోతి మానవ కల్పితమా కాదా అనే విషయంపై నివేదిక సమర్పించాలని కేరళ ప్రభుత్వానికి ఇప్పటికే ఆ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి