భారత రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ ఈనెల 25వ తేదీతో పదవీ విరమణ చేయనున్నారు. ఈయనకు నాడు మాజీ రాష్ట్రపతి, స్వర్గీయ అబ్దుల్ కలాంకు కేటాయించిన బంగళానే కేటాయించనున్నారు. ఈ బంగళా ఢిల్లీలోని 10 రాజాజీ రోడ్‌లో ఉంది.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నాడు ఈ బంగ్లాలోనే నివాసం ఉన్నారు. కలాం మృతి తర్వాత ఈ బంగ్లాను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మకు కేటాయించారు. అయితే, ప్రణబ్ ముఖర్జీ పదవీ విరమణ కానున్న నేపథ్యంలో ఆ బంగ్లాను ఆయనకు కేటాయించారు. దీంతో, మహేశ్ శర్మను వేరే బంగ్లాను కేటాయించారు.
ఈ ప్రత్యేక బంగ్లాలో మొత్తం ఎనిమిది గదులు ఉన్నాయి. పదవీ విరమణ అనంతరం, ప్రణబ్ ఈ బంగ్లాలో నివాసం ఉండనున్న నేపథ్యంలో కొత్త ఫర్నీచర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు నేమ్ ప్లేట్లను మార్చారు. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిని అనంతరం, ప్రణబ్ కు పెన్షన్‌గా నెలకు రూ.75 వేలు ఇవ్వనున్నారు. రెండు టెలిఫోన్లు, ఒక మొబైల్ ఫోన్, కారు, వైద్యసేవలు ఉచితంగా అందిస్తారు. అంతేకాకుండా, దేశంలో ఎక్కడికైనా ఆయన ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు వుంది.