ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం ఘోరం జరిగింది. భక్తులతో వెళుతున్న వాహనం ఒకటి నియంత్రణ కోల్పోయి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది భక్తులు జలసమాధి అయ్యారు. ఈ హృదయ విదాకర ఘటన గోండా జిల్లాలో జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాల మేరకు.. మోతిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహగావ్ గ్రామానికి చెందిన 14 మంది ఒక బొలెరా వాహనంలో ఖర్గుపూర్‌లోని పృథ్వినాథ్ ఆలయానికి పూజల కోసం బయలుదేరారు. మార్గమధ్యంలో వీరి వాహనం సరయూ కాలువలోకి దూసుకెళ్లారు. వాహనం నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే గ్రామ పెద్దకు, పోలీసులకు సమాచారం చేరవేశారు.
ఆ వెంటనే రంగంలోకి దిగిన ఇటియాథోక్ పోలీసులు.. స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. నీటిలో మునిగిపోయిన వాహనం నుంచి మృతదేహాలను వెలికి తీశారు. మృతులలో పురుషులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ దుర్ఘటనపై జిల్లా ఎస్పీ వినీత్ జైస్వాల్ మాట్లాడుతూ, ఆలయానికి వెళుతుండగా బొలెరో వాహనం కాలువలో పడిపోవడంతో 11 మంది మరణించారు. స్వల్ప గాయాలతో బయటపడిన నలుగురిని రక్షించి జిల్లా ఆస్పత్రికి తరలించడం జరిగింది అని తెలిపారు.
మరోవైపు ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు తలా రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్టు ఆయన తన ఎక్స్ వేదికగా వెల్లడించారు. అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం అందిస్తామని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.