పగలంతా తేయాకు తోటల్లో పనిచేసిన కూలీలు రాత్రి వేడుక చేసుకుందామనుకున్నారు. ఇందులో భాగంగా స్థానికంగా ఉండే మద్యం దుకాణం నుండి మద్యం తెప్పించారు. అది 17 మంది ప్రాణాలను బలిగొంది. దానిని సేవించిన మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన అసోంలోని గోలాఘాట్‌లో జరిగింది. గోలాఘాట్‌లోని సల్మారా టీ ఎస్టేట్‌లో పనిచేస్తున్న కూలీలు గురువారం రాత్రి వేడుక చేసుకున్నారు. వారికి స్థానికంగా ఉండే సంజు ఒరాంగ్ అనే వ్యక్తి మద్యం సరఫరా చేశాడు. మద్యం సేవిస్తుండగా కొద్ది సేపటికి నలుగురు మహిళలు కిందపడిపోయారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
పరీక్ష చేసిన వైద్యులు వారు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. విషపూరిత మద్యం తాగినందువల్లే ఇలా జరిగిందని చెప్పారు. శుక్రవారం ఉదయం మరో 13 మంది మృత్యువాతపడ్డారు. కొంత మంది ఆసుపత్రిపాలయ్యారు. దాదాపుగా 30 మందికి పైగా ఆ వేడుకలో విషపూరిత మద్యం సేవించారని పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రిలో ఉన్నవారి పరిస్థితి విషమంగా ఉందని, మరింత మంది చనిపోయే అవకాశం ఉందని కూడా వారు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రసాయనాల క్యాన్‌లలో మద్యాన్ని తీసుకురావడం వల్లే అది కలుషితమైందని భావిస్తున్నారు. అది కల్తీ మద్యం అయి ఉంటుందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.