ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న బస్సును భారీ ట్రక్కు ఢీ కొట్టిన ఘటనలో 18మంది మృతి చెందగా.. 19మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా బీహార్‌వాసులుగా గుర్తించారు అధికారులు. బీహార్‌కు చెందిన వలసకూలీలు హర్యానా నుంచి స్వస్థలాలకు తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ట్రక్కు ఢీ కొనడంతో బస్సు ముందు భాగమంతా నుజ్జునుజ్జు అయ్యింది. వలస కూలీలంతా బస్సు ముందు భాగంలోనే ఉండటంతో.. వారంతా చనిపోయారు. మరికొందరు బస్సులోనుంచి రోడ్డుపై పడ్డారు. దీంతో మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదానికి గురైన డబుల్ డక్కర్ బస్సులో సుమారు వందకుపైగా ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వారంతా హర్యానాకు చెందిన పాల్వాల్, హిసర్ జిల్లాల నుంచి బిహార్ వస్తున్నట్టుగా తెలిపారు బారాబంకీ ఎస్పీ యమునా ప్రసాద్.
ప్రమాదంలో గాయపడిన వారందరినీ స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు అధికారులు. ప్రయాణికులంతా బీహార్‌కు చెందిన వివిధ ప్రాంతాల వారు కాగా.. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లుగా తెలిపారు ఎస్పీ యమునా ప్రసాద్. క్రేన్ సాయంతో బస్సును రోడ్డుపై నుంచి తీసివేశామని.. బస్సు కింద ఎవరూ లేరని వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.