తొలుత టూ వీలర్ నడపడం నేర్చుకున్న దెలిషా, ఆపై ఫోర్ వీలర్ డ్రైవింగ్ ను కూడా నేర్చేసుకుంది. ఈ క్రమంలో తన తండ్రి నడిపే పెట్రోల్ ట్యాంకరు డ్రైవింగ్‌ను కూడా కొద్దికాలంలోనే వంటబట్టించుకుంది. 16 ఏళ్ల వయసులోనే దెలిషా లారీ నడిపిందంటే ఆమె నైపుణ్యం, తపన ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. మల్టీయాక్సిల్ వోల్వో బస్సు నడపాలన్నది దెలిషా కల. అందుకు వీలుగా ప్రత్యేక లైసెన్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది.
ఆమె తండ్రి పీఏ డేవిస్ లారీ డ్రైవర్ కావడంతో, దెలిషా ఆ దిశగా ఆసక్తి పెంచుకుంది. డేవిస్ కూడా ఎంతో ధైర్యంతో తన కుమార్తెను డ్రైవింగ్ చేసేందుకు ప్రోత్సహించారు. దెలిషా వారానికి మూడు పర్యాయాలు ఓ పెట్రోల్ ట్యాంకరును కొచ్చి నుంచి మళప్పురం వరకు తీసుకెళ్లి మళ్లీ తిరిగొస్తుంది.
ఓసారి రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా, దెలిషా లారీని కూడా ఆపారు. డ్రైవింగ్ సీట్లో అమ్మాయిని చూసి వారు విస్మయానికి గురయ్యారు. అమ్మాయి అయినప్పటికీ నిబ్బరంగా లారీ నడుపుతున్న తీరు చూసి అధికారులు సైతం ఆమెను అభినందించారు.