ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ మత సమ్మేళనంలో పాల్గొన్న విదేశీ ప్రతినిధుల్లో 800 మందికి పైగా ప్రతినిధుల ఆచూకీ తెలియరాలేదు. దీంతో వారి ఆచూకీని తెలుసుకునేందుకు ఢిల్లీ పోలీసులు కొన్ని బృందాలను ఏర్పాటు చేయగా, ఈ బృందాలు రేయింబవుళ్లు శ్రమించి వారి ఆచూకీని తెలుసుకున్నాయి.
దీంతో మసీదుల్లో తనిఖీలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. వీరిలో ఢిల్లీ ఈశాన్య జిల్లాలోని మసీదుల్లో 100 మంది, ఆగ్నేయ జిల్లాలో 200 మంది, దక్షిణ జిల్లాలో 170 మంది, పశ్చిమ జిల్లాలో ఏడుగురు విదేశీయులు దాక్కున్నారని, మిగతా వారిని గుర్తించాలని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
కాగా, జమాత్‌లో పాల్గొన్న విదేశీయుల్లో చాలా మందిని గుర్తించినప్పటికీ, కొంతమంది ఆచూకీ చిక్కక పోవడంతో పోలీసులు, ఢిల్లీ ప్రభుత్వ అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు వీరి ఆచూకీ కనుగొనడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, న్యూఢిల్లీ మర్కజ్‌లో తగ్లిబీ జమాత్ నిర్వహించిన ప్రార్థనలు ఇప్పుడు కరోనా కేంద్రబిందువుగా మారాయి. ఇందులో పాల్గొన్న వేలమందిని కరోనా పాజిటివ్‌లుగా గుర్తించారు. వీరివల్ల ఇంకెంతమంది ఈ మహమ్మారి బారిన పడ్డారనే విషయం ఇప్పుడు పాలకులను ఆందోళనలకు గురిచేస్తున్నది.