ఆలయంపై పడిన కొండ చరియలు.. 9 మంది మృతి.. శిథిలాల కింద మరో 20 మంది

సోమవారం, 14 ఆగస్టు 2023 (11:54 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా ఏర్పడిన వరదలతో ఆ ప్రాంత ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా, గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుంభవృష్టికి పలు చోట్ల విపత్కర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సిమ్లాలోని ఓ ఆలయంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, శిథిలాల కింద మరో 20 మంది వరకు ఉన్నట్టు సమాచారం. 
 
సోమవారం ఉదయం సమ్మర్‌ హిల్‌ ప్రాంతంలోని శివాలయంపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆలయం కుప్పకూలి పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికితీయగా.. శిథిలాల కింద మరో 20 మందికి పైనే ఉన్నట్లు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నారు.
 
ఉత్తర భారతంలో నేడు శ్రావణ సోమవారం కావడంతో ఉదయం నుంచే శివాలయానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారు. ప్రమాద సమయంలో ఆలయం వద్ద దాదాపు 50 మంది వరకు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఆలయం కూలిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి సఖ్వీందర్‌ సింగ్‌ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శిథిలాలను తొలగించి ప్రజలను రక్షించేందుకు స్థానిక యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోందని తెలిపారు. ఘటనాస్థలాన్ని సీఎం పరిశీలించనున్నారు.
 
ఇదిలావుంటే, హిమాచల్‌లో 24 గంటల వ్యవధిలోనే 16 మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరం. ఆదివారం సోలన్‌ జిల్లాలోని జాదోన్‌ గ్రామంలో కురిసిన కుంభవృష్టికి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో శిమ్లాలో 131.6 మి.మీల వర్షపాతం నమోదైంది. నేడు, రేపు కూడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాలు, కొండచరియల కారణంగా దాదాపు 750 రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు