ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖం పైన ఓ వ్యక్తి ద్రవం పోసాడు. శనివారం సాయంత్రం దక్షిణ ఢిల్లీలోని షేక్ సరాయ్ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి ద్రవం విసిరాడు. ఘటనా స్థలంలో ఉన్న భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గ్రేటర్ కైలాష్ ఎమ్మెల్యే, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్‌తో కలిసి కేజ్రీవాల్ ఇరుకైన సందులో ప్రజలకు అభివాదం చేస్తూ నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇద్దరు నేతలకు ఇరువైపులా పోలీసులు తాడు బిగించి జనాన్ని అదుపు చేశారు.
కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా ఆప్ నిర్వహించిన పాదయాత్ర మాల్వీయా నగర్ ప్రాంతంలో అనుమతి లేకుండా జరిగిందని ఒక ప్రకటనలో పోలీసులు తెలిపారు. ఐతే ప్రజల రద్దీని నియంత్రించేందుకు పోలీసులను మోహరింపజేసినప్పటికీ, ఖాన్‌పూర్ డిపోకు చెందిన బస్ మార్షల్ అశోక్ ఝా, కేజ్రీవాల్ అనుచరులకు అభివాదం చేస్తున్నప్పుడు అతనిపై ద్రవం పోసాడు. సమీపంలోని పోలీసులు ఝాను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఎందుకిలా చేసాడన్నది తెలియాల్సి వుంది.