సొంత చిట్కాతో ప్రాణం తీసుకున్న వ్యక్తి.. కరోనాకు విరుగుడని కిరోసిన్ తాగి...

మంగళవారం, 18 మే 2021 (08:44 IST)
కరోనా కష్టకాలంలో చాలా మంది సొంతింటి వైద్య చిట్కాలను పాటిస్తున్నారు. అలా చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా కూడా ఓ వ్యక్తి కరోనాకు సరైన విరుగుడు కిరోసిన్ అని గుడ్డిగా నమ్మి కడుపునిండా తాగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. 
 
వ్యక్తికి కొద్దిగా జ్వరం ఉండడంతో కొవిడ్‌ అని అనుమానించి కిరోసిన్‌ తాగేశాడు. కొన్ని రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూశాడు. ఈ ఘటన భోపాల్‌లోని శివ్‌నగర్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మహేంద్ర(30) అనే వ్యక్తి శివ్‌నగర్‌లో నివాసముంటున్నాడు. కొన్ని రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. మందులు వేసుకున్నా లాభం లేకపోయింది. దీంతో అది కొవిడే అన్న అనుమానం బలపడింది. 
 
అంతకు ముందు ఎవరో వ్యక్తి చెప్పడం గుర్తొచ్చి.. కరోనాకు విరుగుడు కిరోసినేనని భావించి సేవించాడు. గత బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తీరా అతనికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తే నెగెటివ్‌గా తేలడం కొసమెరుపు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు