ఎవరైనా తప్పు చేస్తే తొలుత హెచ్చరిస్తారు. మాట వినకుంటే పోలీసులకు పట్టిస్తారు. అదే ఒక ప్రజా ప్రతినిధి అయితే, తన అధికారాన్ని ఉపయోగించి తక్షణం అరెస్టు చేయిస్తాడు. కానీ, ఇక్కడ ఆప్ ఎమ్మెల్యే అలా చేయలేదు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. యువతులను వేధించాడన్న కోపంతో ఓ వ్యక్తిని గొడ్డును బాదినట్టు చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని కిరారీ ప్రాంతానికి చెందిన వికాస్ అనే యువకుడు యువతులను వేధిస్తున్నాడనే ఆరోపణలతో ఆప్ ఎమ్యెల్యే సౌరవ్ ఝా.. అతడిని చితకబాదాడు. దొడ్డు కర్ర చేత పట్టుకుని వికాస్‌ని చావబాదాడు. పక్కన పోలీసులు ఉన్నప్పటికీ ఆ ప్రజాప్రతినిధి రెచ్చిపోయాడు.
ఎమ్యేల్యేనే రెచ్చిపోతే తామెందుకు ఎందుకు కొట్టవద్దని అనుకున్నారో ఏమో అక్కడున్నవారు.. వారు కూడా కర్రలు చేత పట్టుకుని వికాస్‌ని చితకొట్టారు. బాధలు భరించలేని వికాస్ అరుపులు పెట్టాడు. అయినా వారు కనికరించలేదు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని వికాస్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నవంబరు 14వ తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది.