వాఘా సరిహద్దుల్లో అభినందన్.. మరికొన్ని నిమిషాల్లో అప్పగింత

శుక్రవారం, 1 మార్చి 2019 (16:06 IST)
పాకిస్థాన్ ఆర్మీ వద్ద బందీగా ఉన్న భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్ధమాన్ ఇపుడు వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. ఆయన్ను మరికొన్ని క్షణాల్లో పాకిస్థాన్ అధికారులు భారత్‌కు అప్పగించనున్నారు. 
 
నిజానికి ఈ అప్పగింత ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నానికే పూర్తికావాల్సి ఉంది. కానీ, రావల్పిండి రక్షణ స్థావరం నుంచి అభినందన్‌ను లాహోర్ వరకు, అక్కడ నుంచి వాఘా సరిహద్దుకు తరలించే ప్రక్రియలో జాప్యం జరిగింది. ఫలితంగా అభినందన్ అప్పగింత ప్రక్రియలో జాప్యం నెలకొంది. 
 
బుధవారం జమ్మూ కశ్మీర్‌లోని సైనిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించిన పాకిస్థాన్ వైమానిక దళాన్ని తిప్పికొట్టే క్రమంలో ఐఏఎఫ్‌‌కి చెందిన మిగ్21 యుద్ధవిమానం ఒకటి పాక్ భూభాగంలో కూలిపోయింది. పాక్ విమానాలను తిప్పికొట్టిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాకిస్థాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 
 
జనీవా ఒప్పందం ప్రకారం ఆయనను వెంటనే బేషరతుగా స్వదేశానికి తిప్పి పంపాలంటూ భారత్ అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఇరుదేశాల మధ్య శాంతిని ఆకాంక్షిస్తూ అభినందన్‌ను విడుదల చేస్తున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ జాతీయ అసెంబ్లీలో ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు